పైపులైన్లు తొలగించకపోతే ఎన్నికలు బహిష్కరిస్తాం

  • రోడ్డుపై బైఠాయించి మత్స్యకారుల నిరసన
  • మద్దతు తెలిపిన ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి

ప్రజాశక్తి- యు.కొత్తపల్లి (కాకినాడ జిల్లా) : అరబిందో ఫార్మా పరిశ్రమలోని వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెట్టేందుకు వేసిన పైపులైన్లను వెంటనే తొలగించాలని, లేకుంటే రానున్న ఎన్నికలను బహిష్కరిస్తామని కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మత్స్యకారులు హెచ్చరించారు. పైపులైన్లను తొలగించాలంటూ గురువారం కొనపాపపేటలోని బీచ్‌ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వారికి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి మద్దతు తెలిపారు. అనంతరం ఎపి మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు, రాష్ట్ర సహాయక కార్యదర్శి సిహెచ్‌ రమణి, జిల్లా నాయకులు ఉప్పాడ సత్యనారాయణతో కలిసి ఆమె బోటుపై సముద్ర మార్గం గుండా వెళ్లి పైపులైను పనులు పరిశీలించారు. అనంతరం తిరిగి శిబిరం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ అరబిందో ఫార్మా పరిశ్రమ సముద్రంలోకి వేసిన పైపులైన్ల వల్ల మత్స్యసంపదకు నష్టం వాటిల్లితుందన్నారు. పైపులైన్ల వల్ల వలలు, బోట్లు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. వారం రోజులుగా మత్స్యకారులు నిరసన తెలుపుతున్నా అధికారులు, పాలకులు స్పందించకపోవడం దారుణమన్నారు. వెంటనే పైపులైన్లను తొలగించాలని డిమాండ్‌ చేశారు. మత్స్యకారుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కొల్లాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పైపులైన్‌ ద్వారా వ్యర్థాలను సముద్రంలోకి వదలడంతో మత్స్యకారుల జీవన ఉపాధికి ఆటంకం కలుగుతుందన్నారు. సమస్యను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. కొనపాపపేట బీచ్‌ రోడ్డుపై మత్స్యకారుల ఆందోళనతో వాహనాలు నిలిచిపోయాయి.

➡️