Electoral Bonds: ఎవరిద్వారా ఎంత అందిందో చెప్పండి

  • ‘బాండ్ల’పై టిడిపి, వైసిపి, జనసేనకు వి.శ్రీనివాసరావు ప్రశ్న

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో టిడిపి, వైసిపి, జనసేన పార్టీలు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా అందిన నిధులకు సంబంధించిన పూర్తి వివరాలను బయట పెట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఏ పెట్టుబడిదారుడు, ఏ కంపెనీ నుండి ఎంత మొత్తం నిధులు అందాయో తెలియచేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ‘బాండ్ల వ్యవహారం అతిపెద్ద స్కామ్‌’ అని పేర్కొన్నారు. మొత్తం బాండ్లలో సగం రూ.6,986.5 కోట్లు బిజెపికి వెళ్లాయని తెలిపారు. వైసిపికి రూ.337 కోట్లు, టిడిపికి రూ.218.88 కోట్లు, జనసేనకు రూ.21 కోట్లు కార్పొరేట్‌ సంస్థల ద్వారా వచ్చాయని, ఇవి ఎవరెవరు ఇచ్చారో బయటపెట్టాలని కోరారు. ఆయా పార్టీలు కూడా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎలక్టోరల్‌ బాండ్ల విధానం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలో ఆర్టికల్‌ 19(1)(ఎ) ప్రకారం వాక్‌ స్వాతంత్య్రాన్ని, సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టంగా తన తీర్పులో వెల్లడించిందని పేర్కొన్నారు. విశ్వసనీయత, పారదర్శకత, నీతి, నిజాయితీ గురించి పదే పదే ప్రస్తావించే జగన్మోహన్‌రెడ్డి బాండ్ల ద్వారా అందిన నిధుల విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి గురించి, స్కామ్‌ల గురించి జీరో బడ్జెట్‌ పాలిటిక్స్‌ గురించి రోజూ మాట్లాడే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కూడా సమాధానం చెప్పాలని కోరారు. దేశవ్యాప్తంగా బాండ్లపై చర్చ జరుగుతుంటే ఈ ముగ్గురూ తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆ పార్టీల జెండాల రంగులే వేరని, ఎజెండా ఒక్కటేనని తెలిపారు. రాజకీయాలను డబ్బులు ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయో ప్రజలకు అర్థమవుతోందని వివరించారు. ఎలక్టోరల్‌ బాండ్లను రద్దు చేయాలని సిపిఎం మొదటి నుండి పోరాడుతోందని, సుప్రీం కోర్టులో కేసు వేసి చివరి వరకూ పోరాడిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి సమాచారం చాలా అవసరమని, ఎలక్టోరల్‌ బాండ్లు చట్టబద్ధ క్విడ్‌ప్రోకో అని విమర్శించారు.

➡️