తుపానులోనూ వర్షం కరువే..!

Dec 8,2023 11:20 #Anantapuram District, #Michoung

అనంతను తాకని వర్షం 

రాష్ట్రమంతటా వర్షాలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పడని వాన

ప్రజాశక్తి – అనంతపురం ప్రతినిధి :   మిచౌంగ్‌ తుఫాను రాష్ట్రం మొత్తాన్ని వణికించింది. తుఫాన్‌ దెబ్బకు గత మూడు రోజులుగా అంతటా అపారమైన నష్టం సంభవిం చింది. కాని ఉమ్మడి అనంతపురం జిల్లాపై మాత్రం దీని ప్రభావం లేదు. మేఘాలు కమ్ముకుని రావడం అంతలోనే గాలి వేగానికి కొట్టుకుపోవడం కనిపించింది. అప్పుడప్పుడు, అక్కడక్కడ కొద్దిపాటి చిరుజల్లులు మాత్రమే పడ్డాయి. తుఫాన్‌లో సైతం వర్షం కరువు అవడంపై రైతులు తీవ్ర నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నారు.

డిసెంబర్‌ 1వ తేదీ నుంచి తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్రం అంతటా వర్షాలు అన్ని చోట్లా వర్షాలు పడుతున్నాయి. వానల ఉధృతికి పలు నగరాలు జలమయం అయ్యాయి. పంటలు చాలా వరకు నష్టం వాటిల్లాయి. మూడు రోజుల పాటు వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. అక్కడ పరిస్థితి అలా ఉంటే అనంతపురం, సత్యసాయి జిల్లాలో చినుకు జాడలేదు. ఒక్క ఎన్‌పికుంట మం డలంలో మాత్రమే ఒక మోస్తరు వర్షపాతం తుపా ను ప్రభావం కారణంగా పడిందని చెప్పవచ్చు.

పడని వాన

ఈ ఏడాది సీజన్‌ ప్రారంభం నుంచే వర్షాభావం జిల్లాలో నెలకొంది. ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లలోనూ వర్షాభావం వెంటాడుతుండటంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతోనైనా వర్షాలస్తా యని రైతులు భావించారు. రాష్ట్రమంతటా వర్షం పడినప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాన పడలేదు. డిసెంబరు ఒకటి నుంచి ఇప్పటి వరకు చూస్తే అనంతపురం జిల్లాలో సగటున 1.1 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదయ్యింది. అది కూడా ఆత్మకూరు మండలం పరిధిలో 8.6 మిల్లీమీటర్లు, తాడిపత్రి పరిధిలో 6.5 మిల్లీమీటర్లు, పెద్దపప్పురు మండలంలో 6.5 మిల్లీమీటర్లు, యల్లనూరు మండలంóలో 4.9 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయింది. తక్కిన చోట్ల చినుకుజాడలేదు. సత్యసాయి జిల్లాలో సగటున 4.7 మిల్లీమీటర్లు వర్షపాతం నమోద యింది. అందులో గరిష్టంగా నంబులపూలకుంట మండలంలోనే వర్షపాతం నమోదయింది. 5వ తేదీన 47.8 మిల్లీమీటర్లు నమోదవగా 6వ తేదీన 0.5 మిల్లీమీటర్లు నమోదయింది. మొత్తంగా ఈ మండలం పరిధిలోనే ఈ ఐదు రోజుల్లో పడిన వర్షపాతం 51.5 మిల్లీమీటర్లు. ఆ తరువాత తలుపులలో 18.7 మిల్లీమీటర్లు, గాండ్లపెంటలో 18.1 మిల్లీమీటర్లు పడింది. ఈ మూడు మండలాల్లోనే తుఫాను ప్రభావం కొంత కనిపించింది. తక్కిన మండలాలు వర్షపాతం నమోదవలేదు. ఏడాది మొత్తంగా 30 శాతానికిపైగా లోటు అనంతపురం జిల్లాలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 453 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా, 288.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయింది. సాధారణం కంటే 36.2 శాతం ఈ ఏడాది వర్షపాతం లోటుంది. 31 మండలాలు అనంతపురం జిల్లా పరిధిలో ఉంటే 24 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సత్యసాయి జిల్లాలో సాధారణ వర్షపాతం 521.5 మిల్లీమీటర్లు అయితే ఇప్పటి వరకు నమోదయిన వర్షపాతం 360.7 మిల్లీమీటర్లు. అంటే సాధారణం కంటే 30 శాతం వర్షపాతం లోటుంది. 32 మండలాలకుగానూ 25 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు ప్రాంతాల్లోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం ఇప్పటికే కరువు మండలాలను ప్రకటించింది. రబీలోనూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులే నెలకొన్నాయి. ప్రభుత్వం కరువు మండలాలను అయితే ప్రకటించిది గానీ ఇంత వరకు ఎలాంటి సహాయక చర్యలూ చేపట్టలేదు. దీనిపై రైతుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. కరువు మండలాల ప్రకటనతో ప్రభుత్వం మిన్నకుండిపోకుండా సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని సిపిఎం, రైతుసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

➡️