ప్రతి రాజకీయ పార్టీ స్టీల్‌ప్లాంట్‌ అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాలి

  • ఉక్కు మహా గర్జన ధర్నాలో వక్తలు డిమాండ్‌

ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) : ప్రతి రాజకీయ పార్టీ విశాఖ ఉక్కు పరిరక్షణ అంశాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాలని వక్తలు డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద 1165 రోజులుగా జరుగుతున్న రిలే దీక్షల శిబిరంలో ఆదివారం ఉక్కు మహా గర్జన పేరిట ధర్నా నిర్వహించారు. పోరాట కమిటీ చైర్మన్‌, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ మూడేళ్లుగా స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు పోరాడుతున్నా పట్టించుకోని కేంద్ర బిజెపి నాయకులు నేడు అబద్ధాలతో కార్మికులను, ప్రజలను మోసపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించబోమని, పూర్వవైభవం తీసుకొస్తామని, ఉత్పత్తిని పెంచుతామని ఎన్నికల ముందు బిజెపి నాయకులు చెప్పడం మోసగించడమేనని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు ముడి ఖనిజం అందకుండా అదానీ గంగవరం పోర్టు, మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నాయన్నారు. దీనిలో భాగంగానే బొగ్గును నిలుపుదల చేశాయని వివరించారు. నెల రోజులకు సరిపడా ముడిసరుకు స్టీల్‌ప్లాంట్‌లో ఎప్పుడూ ఉండేదని, నేటి పరిస్థితి దానికి భిన్నంగా ఉందని తెలిపారు. కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలలో కోల్‌ లేకుండా చేయడం వెనుక స్టీల్‌ యాజమాన్యం కుట్ర దాగి ఉందన్నారు. పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణపై స్పష్టమైన ప్రకటన చేసిన పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. లాభాల్లో ఉన్న ప్లాంట్‌పై ఆంక్షలు పెట్టి, ఇబ్బందులకు గురిచేసి పాలకులు నష్టాలవైపు నెట్టేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే విశాఖ ఉక్కు కర్మాగారం నేడు సమస్యలను ఎదుర్కొంటోందని తెలిపారు. రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉక్కునగరం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ కెఎస్‌ఎన్‌.రావు, కో-కన్వీనర్లు నీరుకొండ రామచందర్రావు, జె.అయోధ్యరామ్‌, విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాల జెఎసి చైర్మన్‌ మరడాన జగ్గునాయుడు, పోరాట కమిటీ ప్రతినిధులు యు.రామస్వామి, మసేన్‌రావు, కారు రమణ, డివి.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️