బిజెపికి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు రాజీనామా

Dec 18,2023 11:23 #BJP, #resigns
ex mla resign to bjp

ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిజెపి విజయనగరం పార్లమెంట్‌ స్థానం కన్వీనర్‌ గద్దె బాబూరావు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయనగరంలోని ఓ హోటల్‌లో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యక్తిగత కారణాలతోనే తాను బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది టిడిపి అని, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా బాధపడ్డానని చెప్పారు. ఎన్‌టిఆర్‌, చంద్రబాబు దయ వల్ల ఎంతో మందికి సహాయం చేయగలిగానని తెలిపారు. చీపురుపల్లి ప్రజలు తనను ఆదరించి రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారని అన్నారు. అనుకోని కారణాల వల్ల టిడిపిని వీడి బిజెపిలో చేరానన్నారు. పార్టీకి విధేయుడిగా అన్ని పనులు చేశానని, అయితే వ్యక్తిగత సమస్యలు వల్ల బిజెపికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తన పోరాట పటిమ బిజెపిలో చాలా మందికి నచ్చలేదన్నారు. ఈ జిల్లాలో బిసిలకు ప్రాధాన్యత ఇవ్వాలని అడిగానని, కానీ పార్టీ పట్టించుకోలేదన్నారు. ఏ పార్టీలో చేరాలనే నిర్ణయం కార్యకర్తలు, నాయకులతో చర్చించి తీసుకుంటానని తెలిపారు.

➡️