అమరావతి రాజధాని కనెక్టివిటీ కోసం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు విస్తరణ

– బ్యారేజీ నుండి 200 అడుగుల వెడల్పు
– రెండో దశలో 1.8 కిలోమీటర్ల ఫ్లైఓవర్‌, 4.8 కిలోమీటర్ల రోడ్డు
– మణిపాల్‌ వద్ద జాతీయ రహదారికి లింకు
– మేఘా లిఫ్టు నుండి కరకట్ట విస్తరణకు ప్రణాళిక
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాజధాని అమరావతికి కీలకమైన కనెక్టివిటీపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాజధానికి సరైన రోడ్డు లేదని రాజకీయ పరమైన విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి అటువంటి విమర్శలకు తావివ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని ప్రాజెక్టుల్లో రోడ్డు కనెక్టివిటీకి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది. దీనికోసం ప్రస్తుతం ఉన్న కరకట్టను ప్రకాశం బ్యారేజీ నుండి వెంకటపాలెం ప్రకృతి ఆశ్రమం వరకూ 200 అడుగులు విస్తరించాలని నిర్ణయించింది. మొత్తంగా ప్రస్తుతం ఉన్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును ప్రకాశం బ్యారేజీ వరకూ ఒకదశ, పిడబ్ల్యుడి వర్కుషాపు నుండి సుందరయ్యనగర్‌ వరకూ రెండోదశలో ఫ్లైఓవర్‌, మూడోదశలో మణిపాల్‌ వరకూ కనెక్టివిటీ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం మధ్యలో ఆగిపోయిన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును విస్తరించి ట్రంకు రోడ్డు (పాత జాతీయ రహదారి) అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి ప్రాధాన్యతగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సిఆర్‌డిఎ అధికారులకూ సూచించింది. గతంలో కరకట్ట రోడ్డు ఉన్నా అనుసంధాన విషయంలో కోర్టు కేసులు, రైతుల అభ్యంతరాలతో కాలం గడిచిపోయింది. దీంతో కనెకట్టివిటీ సమస్య పరిష్కారం కాలేదు. మాస్టర్‌ప్లాను ప్రకారం దొండపాడు నుండి వెంకటపాలెం రెవెన్యూ సరిహద్దు వరకూ 200 అడుగుల వెడల్పుతో రోడ్డు వేసి ఆపేశారు. టిడిపి ప్రభుత్వం మారిన వెంటనే కనీస రోడ్డులేని రాజధాని అంటూ రాజకీయ విమర్శలూ వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ముందుగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును ఉండవల్లి సమీపంలో పాత జాతీయ రహదారికి ప్రకాశం బ్యారేజీ దగ్గర కలపాలని నిర్ణయించారు. పెనుమాక రెవెన్యూలో 26.24 ఎకరాలకు గానూ 23 ఎకరాలు గతంలో రైతులు ఇచ్చేశారు. ఇంకా 3.24 ఎకరాలు పెండింగ్‌ ఉంది. ఇటీవల ఈ పొలం ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడంతో సిఆర్‌డిఎ అధికారులు మార్కింగు చేసి ఇచ్చేశారు. పరిహారం అంశంపై కమిషనర్‌నూ సంప్రదించారు. త్వరలో దీనికి పరిష్కారం లభించనుంది. అలాగే ఉండవల్లిలో సుమారు 30 ఎకరాలు రైతుల నుండి తీసుకోవాల్సి ఉంది. అయితే ఎకరాకు ఎంత పరిహారం ఇస్తారనే అంశంపై సమస్య పెండింగ్‌లో ఉంది. ఏ పొలంలో ఎంత భూమి కావాల్సి వస్తుందో మార్కింగు చేస్తే దాని ఆధారంగా పరిహారం అంశం పరిష్కరించుకోవచ్చని సిఆర్‌డిఎ అధికారులు చెబుతున్నారు. 2021లోనూ ఈ రోడ్డు విస్తరణ అంశంపై చర్చ జరిగింది. 15.6 కిలోమీటర్ల రోడ్డును విస్తరించేందుకు రూ.150 కోట్లతో మేఘా కంపెనీకి పనులు అప్పగించారు. భూములకు నోటిఫికేషన్‌ కూడా ఇచ్చారు. రైతులు కోర్టుకు వెళ్లడంతో పనులు ఆగిపోయాయి.
200 అడుగుల రోడ్డు
ప్రసుత్తం వెంకటపాలెం సరిహద్దు వద్ద ఆగిపోయిన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును మూడు దశల్లో విస్తరించనున్నారు. తొలిదశలో వెంకటపాలెం రెవెన్యూ నుండి ప్రకాశం బ్యారేజీ సమీపంలోని పాత జాతీయ రహదారి వరకూ విస్తరిస్తారు. దీనికి సంబంధించిన భూ సమీకరణ ప్రక్రియ మొదలుపెట్టి తొలివిడతలో రైతులతో సమావేశం నిర్వహించారు. రెండోదశలో పిడబ్ల్యుడి వర్కుషాపు నుండి 1.8 కిలోమీటర్ల దూరం ఫ్లైఓవర్‌ పద్ధతిలో రోడ్డు నిర్మిస్తారు. మూడోదశలో 4.8 కిలోమీటర్ల పొడవైన రోడ్డును మణిపాల్‌ వరకూ నిర్మించి అక్కడ జాతీయ రహదారికి లింకు ఏర్పాటు చేయనున్నారు. ప్రకాశం బ్యారేజీ వరకూ రోడ్డు వేసినా ట్రాఫిక్‌ సమస్యకు పెద్దగా పరిష్కారం దొరకదని, జాతీయ రహదారికి అనుసంధానం చేస్తేనే పరిష్కారమవుతుందని సిఆర్‌డిఎ అధికారులు చెబుతున్నారు.

➡️