తెలంగాణలో చలి తీవ్రత

Jan 1,2024 13:11 #Extreme cold, #Telangana

తెలంగాణ : తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే దిగువకు పడిపోయాయి. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలితో పాటు విపరీతమైన పొగ, మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు, రేపు రాష్ట్రంలో చలిగాలులు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో నేడు, రేపు ఏడు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు ఏజెన్సీ జిల్లాలైన ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. గత శనివారం రాత్రి రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 10.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. పలు జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా సోనాల్‌లో 10.7, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో 11.2, నాగర్‌కర్నూల్‌ జిల్లా కొండారెడ్డిపల్లిలో 11.7, సంగారెడ్డి జిల్లా అల్మాయిపేటలో 12.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

➡️