ఆర్థిక ఇబ్బందులతో స్వర్ణకారుని కుటుంబం ఆత్మహత్య

Dec 30,2023 09:13 #anakapalle district, #Suicide
family suicide in ankapalli

ప్రజాశక్తి- అనకాపల్లి : అప్పుల బాధతో అనకాపల్లిలో స్వర్ణకారుని కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. అనకాపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి డిఎస్‌పి సుబ్బరాజు కథనం ప్రకారం… అనకాపల్లిలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం సమీపంలో ఉన్న లక్ష్మీ పేరడైజ్‌ అపార్టుమెంట్‌లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొడవలి శివరామకృష్ణ (45) కుటుంబం 18 నెలల క్రితం అద్దెకు దిగింది. ఆయనకు భార్య మాధవి (38), కుమార్తెలు వైష్ణవి (14), జాహ్నవి (12), కుసుమ ప్రియ ఉన్నారు. సిటీ పబ్లిక్‌ స్కూల్‌లో వైష్ణవి తొమ్మిదో తరగతి, జాహ్నవి ఎనిమిదో తరగతి, కుసుమ ప్రియ మూడో తరగతి చదువుతున్నారు. గురువారం అర్ధరాత్రి తర్వాత కుసుమ ప్రియ పొరుగున ఉన్న వారిని లేపి తమ తల్లిదండ్రులు, అక్కలు అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలిపింది. దీంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా అప్పటికే వారు మృతి చెందినట్లు గుర్తించారు. రాత్రి తెచ్చుకున్న స్వీట్లు, పలావుల్లో పాయిజిన్‌ కలిపి తినడంతో వారంతా చనిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు. కుసుమప్రియకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. శివరామకృష్ణ అనకాపల్లిలో ఒక షాపును అద్దెకు తీసుకుని నగలు తయారు చేసేవారు. దేవాలయ విగ్రహాలకు వెండి కిరీటాలు, ఆభరణాలు చేయడంలో అందివేసిన చేయిగా స్థానిక బంగారు వర్తకులు చెబుతున్నారు. శివరామకృష్ణ తెనాలిలో ఉండగానే అప్పులు చేశారని, అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక విశాఖపట్నం వెళ్తున్నట్టు చెప్పి తన కుటుంబంతో అనకాపల్లి వచ్చారని ఆయన బంధువులు తెలిపారు. ఇక్కడ కూడా వెండి నగల కోసం ఆర్డర్లు ఇచ్చిన వారికి సకాలంలో ఇవ్వకపోవడం, అప్పులు చేయడంతో వారి నుంచి ఒత్తిడి పెరిగిందని, దీంతో, ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నామని చెప్పారు.

➡️