‘జువారి’ కాలుష్య కోరల్లో రైతులు

Feb 22,2024 11:34 #farmers, #Juwari Cements, #Pollution

దుమ్ముతో పంట పొలాలకు తీవ్ర నష్టం

మైనింగ్‌ కారణంగా అడుగంటిన జలవనరులు

దిగుబడి లేదంటూ చీనీ రైతుల ఆవేదన

ప్రజాశక్తి-ఎర్రగుంట్ల (కడప) :    పరిశ్రమలు వస్తే స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఆ కారణంగా జువారి సిమెంట్స్‌ పరిశ్రమ నిర్మాణానికి మండలంలోని తుమ్మలపల్లి, వలసపల్లి, కోడూరు, పెదనపాడు గ్రామాల రైతులు తమ భూములను త్యాగం చేశారు. పరిశ్రమ ద్వారా ఆ గ్రామాల అభివృద్ధి ఏమో కానీ… రైతులకు మాత్రం శాపంగా మారింది. జువారి పరిశ్రమలో జరుగుతున్న మైనింగ్‌ ద్వారా పొలాలపై పడే దుమ్ముతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. మండల పరిధిలోని వలసపల్లి తుమ్మలపల్లి గ్రామాల్లో జువారి పరిశ్రమలో సున్నపురాయి కోసం చేస్తున్న బ్లాస్టింగ్‌ కారణంగా చీనీ చెట్లు, వేరుశనగ, నువ్వులు, బుడ్డ శనగ, ఇతరత్రా పంట పొలాలపై తెల్లటి దుమ్ముతో పొరలాగా ఏర్పడుతోందని రైతులు పేర్కొంటున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి చీనీ పంటను పండించినప్పటికీ దిగుబడి రావడం లేదని రైతులు వాపోతున్నారు. వలసపల్లి గ్రామంలో 40 నుండి 50 ఎకరాల్లో, తుమ్మలపల్లి గ్రామంలో 70 నుండి 80 ఎకరాల్లో చీనీ పంటను రైతులు పండిస్తున్నారు. జువారి కర్మాగారంలో బ్లాస్టింగ్‌ ద్వారా వచ్చే దుమ్ము కారణంగా పొలాలు బీడువారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్మాగారం నుండి వెలువడే దుమ్ము చీనీ చెట్ల ఆకులపై తెల్లటి పొరలాగా ఏర్పడుతోందని, దీని కారణంగా చీనీ పూత రాలిపోతోందని రైతన్నలు వాపోతున్నారు. ఇతర గ్రామాల్లో ఎకరానికి 10 టన్నులు చీనీ పంట దిగుబడి వస్తే, రెండు గ్రామాల్లో ఎకరానికి రెండు నుండి నాలుగు టన్నులు మాత్రమే దిగుబడి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కర్మాగారంలోని మైనింగ్‌ లోతుకు తవ్వడం కారణం గా భూగర్భంలోని నీరు దిగువ భాగం వైపు ప్రవహించడంతో పొలాల్లోని బోర్లకు నీరు అందడం లేదు. ఈ కారణంగా ఒక రోజుకు 40 నుండి 50 చెట్లకు మాత్రమే నీరు అందివ్వగలుగుతున్నామని రైతులు వాపోతున్నారు. అధిక ఖర్చులు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా చీనీ చెట్లకు నీటిని సరఫరా చేస్తున్నామని రైతులు చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన దిగుబడి రాకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఇంతటి సమస్యను ఎదుర్కొంటున్న పొల్యూషన్‌ అధికారులు ఇటువైపు తొంగి చూడలేదని మండిపడుతున్నారు. ఈ సమస్యపై త్వరలో జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయుటకు రైతులు సిద్ధమవుతున్నారు. రైతులకు న్యాయం చేయాలి జువారి కర్మగారం నుండి వెలువడే దుమ్ముతో చీనీ రైతుల భవిష్యత్తు అగమ్యగోచరంలా మారింది. పెట్టుబడి వ్యయం అధికమవుతోంది. దిగుబడి లేక రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జువారి యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా చూద్దామంటూ దాటవేస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదు. పొల్యూషన్‌ అధికారులు, కలెక్టర్‌ సమస్యపై స్పందించి రైతులకు న్యాయం చేయాలి.

-మురళీమోహన్‌రెడ్డి, రైతు, తుమ్మలపల్లి.

తగ్గిపోయిన భూగర్భజలాలు జువారి కర్మగారంలో మైనింగ్‌ లోతుగా చేయడం కారణంగా భూగర్భంలో నీరు దిగువకు ప్రవహించడంతో పొలాల్లో ఏర్పాటు చేసుకున్న బోర్లలో నీరు అందడం లేదు. భూగర్భంలో జలాలు లేకుండా పోతున్నాయి. నీరు లేక పొలాలు బీడు వారుతున్నాయి. ఉన్న నీరు కూడా కలుషితం కావడంతో చెట్లు చనిపోతున్నాయి. నీరు, దుమ్ము సమస్య కారణంగా దిగుబడి లేక రైతులు నష్టపోతున్నారు.

– వెంకటరామిరెడ్డి, రైతు, వలసపల్లి.

➡️