అనంతలో ఘోరరోడ్డు ప్రమాదం

-ట్రాక్టర్‌ను డీకొన్న ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు

-నలుగురు రైతులు దుర్మరణం

ప్రజాశక్తి- గార్లదిన్నె (అనంతపురం జిల్లా)అనంతపురం జిల్లాలో శనివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు రైతులు ఘటనా స్థలంలోనే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం… గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన కుమ్మరి చిన్నతిప్పన్న (48), కుమ్మరి శ్రీనివాసులు (47), కుమ్మరి నాగార్జున (32), కుమ్మరి శ్రీనివాసులు (30) దాయాదులు. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల సాగు చేసిన వరి పంటను కోత కోసి వడ్లను బియ్యంగా మార్చుకునేందుకు శుక్రవారం రాత్రి గార్లదిన్నె మండలంలోని ఓ రైస్‌ మిల్లుకు తీసుకొచ్చారు. అక్కడ వడ్లను బియ్యంగా మార్చుకుని ట్రాక్టర్లో స్వగ్రామానికి బయలుదేరారు. కల్లూరు పెన్నా నది వంతెన 44వ జాతీయ రహదారిపై శనివారం వేకువజామున మూడు గంటల సమయంలో కర్నూలు వైపు వెళ్తున్న ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు వారి ట్రాక్టర్‌ను వెనుకవైపు నుంచి అతివేగంగా ఢకొీంది. దీంతో, ట్రాక్టర్లో ఉన్న నలుగురు రైతులు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ట్రావెల్‌ బస్సు వారిపై నుంచి దూసుకుపోయింది. దీంతో, ఘటనా స్థలంలోనే రైతులు మరణించారు. కుమ్మరి హరి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం భీతావాహకంగా మారిపోయింది. ఈ ట్రాక్టర్‌ ముందు వెళ్తున్న మరో ట్రాక్టర్లోని రైతులు ప్రమాదాన్ని గుర్తించి ప్రయివేటు బస్సును అక్కడే ఆపేశారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 108 సాయంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండడం, అతివేగంగా బస్సును నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.బాధితుల ఆందోళనఅతివేగంతో ప్రమాదానికి కారణమైన ప్రయివేటు బస్సు యజమాన్యం… మృతి చెందిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ మృతుల బంధువులు ఘటనా స్థలంలో ఆందోళనకు దిగారు. మృతి చెందిన వారి కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు మృతదేహాలను తీసుకెళ్లబోమంటూ అక్కడే బైటాయించారు. పోలీసులు సర్దిచెప్పి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చి వారితో ఆందోళన విరమింపజేశారు. ఒకే గ్రామం, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రైతుల మృతితో మామడూరు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

➡️