వైసిపి పాలనంతా అవినీతిమయం : సినీ నటుడు బాలకృష్ణ

May 3,2024 22:58 #2024 election, #Balakrishna, #TDP

ప్రజాశక్తి – మాధవధార, ఆరిలోవ (విశాఖపట్నం) : రాష్ట్రంలో వైసిపి ఐదేళ్ల పాలనంతా అవినీతిమయంగా మారిందని సినీ నటుడు, టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. విశాఖ జిల్లాలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత పార్క్‌ హోటల్‌ నుంచి బాలకృష్ణ రోడ్‌ షో నిర్వహించారు. అప్పుఘర్‌, జోడుగుళ్లపాలెం, పోలీస్‌ క్వార్టర్స్‌ మీదుగా విశాలాక్షినగర్‌, హనుమంతువాక, పాత డెయిరీఫారం, ఆదర్శనగర్‌, తోటగరువు, బాలాజీనగర్‌, అంబేద్కర్‌ కూడలి, ఆరిలోవ టిఐసి పాయింట్‌, ఆరిలోవ కాలనీ తదితర చోట్ల ఆయన యాత్ర సాగింది. కంచరపాలెం మెట్టు వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని జగన్‌ మోసం చేశారన్నారు. జాబ్‌ కేలండర్‌ను విస్మరించారని అన్నారు. ఆయన తీరుతో రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని, ప్రశాంతమైన విశాఖ నగరాన్ని భూకబ్జాల నగరంగా మార్చారని, ప్రకృతిని ధ్వంసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించారని ఆరోపించాఉ. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రప్పించుకోలేకపోయిన అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. రాష్ట్రంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి విశాఖపట్నం ఎంపి అభ్యర్థి శ్రీ భరత్‌, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు, బిజెపి ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి పి.విష్ణుకుమార్‌ రాజు పాల్గొన్నారు.

➡️