రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి

  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా వంటి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే కేంద్రంలో ఇండియా వేదిక అధికారంలోకి రావాలని, దీనికోసం వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఏలూరు కాశీ విశ్వేశ్వర కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య అధ్యక్షత వహించారు. సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగినవని, అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం తుంగలో తొక్కి, మతాల ప్రాతిపదికన దేశాన్ని చీల్చి మళ్లీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తోందన్నారు. లౌకికవాదానికి ఏమాత్రమూ ప్రాధాన్యత ఇవ్వడంలేదని, ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని తిప్పికొట్టాలని కోరారు. గత పదేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ఏ ఒక్క మౌలిక సమస్యనూ పరిష్కరించలేకపోయిందని, 400 స్థానాలు గెలుస్తామని.. 370 స్థానాలు గెలుస్తామని ప్రజలతో మైండ్‌ గేమ్‌ ఆడుతుంది తప్ప చేసిన మేలు ఏ ఒక్కటీ చెప్పుకోలేకపోతోందని అన్నారు. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అరాచక పాలన సాగించిందని, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా వంటివి సాధించలేకపోయారని, ఆర్ధికంగా రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ ఇండియా వేదికకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో టిడిపి, జనసేన జత కట్టడం అంటే రాష్ట్రానికి ద్రోహం చేయడమేనని అన్నారు. కాంగ్రెస్‌ ఏలూరు అభ్యర్థి కావూరు లావణ్య, సిపిఐ ఏలూరు ఎంఎల్‌ఎ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావును సిపిఎం తరుఫున అభినందించారు. కార్మికుల, కష్టజీవుల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేందుకు ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి కావూరి లావణ్య, సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌, సిపిఎం నాయకులు పి.కిషోర్‌, కాంగ్రెస్‌ నాయకులు రాజనాల రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

➡️