ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ఓ తుగ్లక్‌ చర్య

  • కేంద్రం చర్యను చంద్రబాబు ఎందుకు ఖండించట్లేదు : వడ్డే శోభనాద్రీశ్వరరావు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం : ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ని ఎన్నికల ముందు జగన్‌ నెత్తికెత్తుకోవడం తుగ్లక్‌ చర్యకు నిదర్శనమని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌, మాజీ ఎంపి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీతి ఆయోగ్‌ 2019లో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ని ప్రదిపాదించిందన్నారు. దాన్ని కేంద్రంలోని బిజెపి సర్కారు రాష్ట్రాలకు పంపించిందని వివరించారు. దేశంలో ఈ యాక్ట్‌ను ఎక్కడా అమలు చేయడం లేదని, మోడీకి వీరభక్తుడైన జగన్‌ మాత్రం రాష్ట్రంలో హడావుడిగా అమలు చేశారని తెలిపారు. అధికారంలోకొస్తే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ని రద్దు చేస్తానని చెబుతున్న టిడిపి అధినేత చంద్రబాబు కేంద్ర బిజెపి ప్రభుత్వ చర్యను ఎందుకు నిరసించడం లేదని ప్రశ్నించారు. విభజన హామీలు ఇప్పటికీ నెరవేర్చకపోతే పదేళ్ల కాలంలో రాష్ట్ర పాలకులు ఎందుకు ప్రశ్నించడలేదని నిలదీశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని తెలిపారు. ఇండియా వేదికను గెలిపించి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోడీ పదేళ్ల పాలనలో దేశ సంపద అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు దోచిపెట్టారన్నారు. పొత్తు కుదుర్చుకోవడం ద్వారా మోడీకి చంద్రబాబు, పవన్‌ దాసోహమయ్యారని, పరోక్ష పొత్తుతో జగన్‌ తొత్తుగా మారాడని విమర్శించారు. దేశంలో రైతుల ఉద్యమం, మణిపూర్‌ అల్లర్లు వంటి ఘటనలప్పుడు కూడా చంద్రబాబు, పవన్‌, జగన్‌ నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. జగన్‌, చంద్రబాబు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే తప్ప, మోడీ సర్కార్‌ చేసే తప్పులను ఖండించడంగానీ, కనీసం ఇది తప్పని చెప్పడంగానీ ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. వ్యవసాయం వంటి అంశాలు ఉమ్మడి అజెండాలో ఉన్నప్పటికీ కేంద్రం పెత్తనం చేస్తూ ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నా వీరు ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని పేర్కొన్నారు. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో రాజమండ్రి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కెఎల్‌.రావు తనయుడు విజరురావు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థులు బోడా లకీëవెంకట ప్రసన్న (రాజమండ్రి సిటీ), బాలేపల్లి మురళీధర్‌ (రాజమండ్రి రూరల్‌), ముండ్రు వెంకట శ్రీనివాస్‌ (రాజానగరం), పెద్దిరెడ్డి సుబ్బారావు (నిడదవోలు), మార్టిన్‌ లూథర్‌ (గోపాలపురం), అరిగెల అరుణకుమారి పాల్గొన్నారు.

➡️