విభజన హామీలన్నీ అమలు చేస్తాం – మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :ఆంధ్రప్రదేశ్‌ చాలా ప్రాధాన్యతగల రాష్ట్రమని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌ హామీ ఇచ్చారు. విశాఖలోని ఓ హోటల్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు. బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖకు రైల్వే జోన్‌ విషయంలోనూ ద్రోహం చేసిందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందని చెప్పారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని బిజెపి ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయకపోవడం దారుణమన్నారు. బిజెపి చాలా రాష్ట్రాలలో నష్టపోయిందని, ఎన్నికల ప్రచారంలో మోడీ చాలా అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి హిందూత్వాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా మూడు విడతల ఎన్నికలు పూర్తయ్యాయని, కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. షర్మిలకు పిసిసి పగ్గాలు అప్పజెప్పడం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ వైఎస్‌ఆర్‌ కుమార్తెగా, ఆయన వారసురాలుగా కాంగ్రెస్‌ పార్టీలోకి షర్మిల వచ్చారన్నారు. ఆమె పోరాట పటిమగల మహిళ అని చెప్పారు. జగన్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ విశాఖ జిల్లా అధ్యక్షులు వి.శ్రీనివాస్‌, విశాఖ ఎంపీ అభ్యర్థి పి.సత్యారెడ్డి, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గుత్తుల శ్రీనివాస్‌, దక్షిణం అభ్యర్థి వాసుపల్లి సంతోష్‌, భీమిలి అభ్యర్థి వర్మ, ఉత్తరం అభ్యర్థి రామారావు పాల్గొన్నారు.

➡️