పోలవరం నిర్వాసితులను ముంచుతున్న నాలుగు పార్టీలు

May 4,2024 00:58 #Dharna, #Nirvasitulu, #polavaram

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి, జనసేన, బిజెపితో పాటు వైసిపి అనుసరిస్తున్న వైఖరి పోలవరం నిర్వాసితులకు శాపంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పునరావాసానికి అవసరమైన నిధులను విడుదల చేయడానికి ససేమిరా అంటున్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు నిధులకోసం ఒత్తిడి చేయల్సిన టిడిపి,వైసిపిలు దానికి భిన్నంగా కేంద్రం అడుగులకు మడుగులొత్తాయి. జనసేన కూడా ఏ రోజు ఒత్తిడిచేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఎన్నికల వేళ ఆ పార్టీలు ప్రజలను గందరగోళ పరిచి పబ్బం గడుపుకునే వ్యూహానికి తెరతీశాయి.
రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రప్రభుత్వమే పూర్తి చేయాలని ఉన్న విషయం తెలిసిందే. 2019 నాటికి పూర్తి చేస్తామని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పినా 2021 ఖరీఫ్‌నాటికి పూర్తి చేస్తామని వైసిపి ప్రభుత్వం చాలెంజ్‌ చేసినా ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు నిధులను ఇవ్వడంలో పూర్తి అలసత్వం ప్రదర్శిస్తుండగా, టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ఒత్తిడి పెంచి నిధులు సాధించడలో విఫలమైనాయి. సాధారణంగా ఏ ప్రాజెక్టు నిర్మాణానికి అయినా నిర్మాణం, పునరావాసం రెండింటిని కలిపి అంచనాలు రూపొందిస్తారు. కేవలం ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని, పునరావాసం బాద్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రం కోరుతున్న అడహాక్‌ నిధులు కాదుకదా ఇప్పటికీ ఖర్చు చేసిన రూ 1200 కోట్ల బకాయిని విడుదల చేసేందుకు కేంద్రం కొర్రీలు పెడుతోంది. అందుకే అధికార వైసిపి పార్టీ మేనిఫెస్టో నుండి పోలవరం ప్రాజెక్టును మాయం చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
బిజెపితో కూటమి కట్టిన తెలుగుదేశం, జనసేనల మేనిఫెస్టోలో పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అయినా, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పెట్టిన తిరకాసు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పోలవరం ప్రాజెక్టు కింద పునరావాస బాదితులకు డబ్బును చెల్లించేందుకు సెస్‌ను విధిస్తామని, అలాగే ప్రజల నుండి నిధులను సమీకరిస్తామని తన వంతుగా రూ కోటి ఇస్తామని చేసిన ప్రకటన పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కేంద్రం నుండి నిధులను రాబట్టి పూర్తి చేస్తామని చెప్పకుండా ప్రజలనుండి సెస్‌ ద్వారా విరాళాల ద్వారా నిధులను సేకరించి పూర్తి చేస్తామని చెప్పడం బాద్యతారాహిత్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

➡️