జనసేనకు పోతిన గుడ్‌బై

Apr 8,2024 22:15 #goodbye, #JanaSena, #resigned, #Vijayawada
  • పార్టీలో పని చేసిన వారికి ఎందుకు సీట్లు ఇవ్వలేదు
  • భవిష్యత్తుపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటా

ప్రజాశక్తి- వన్‌టౌన్‌ (విజయవాడ) : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పోతిన వెంకట మహేష్‌ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జనసేనలో పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. సీటు రాలేదని అసంతృప్తితో మాట్లాడడం లేదన్నారు. పవన్‌ను నమ్మి అడుగులు వేశామని చెప్పారు. రాజకీయాల్లో మార్పు తెస్తారని అనుకున్నామని, కొత్త తరాన్ని తీసుకుని వస్తారని గుడ్డిగా అడుగులు వేశామన్నారు. తనలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకు పవన్‌ సమాధానం చెప్పాలని కోరారు. ఇన్నాళ్లూ స్వార్థపరులతో ప్రయాణం చేస్తున్నానని అర్థం కాలేదని, ఇన్ని రోజులు పవన్‌ లాంటి వ్యక్తితో నడిచినందుకు అసహ్యం వేస్తోందని వ్యాఖ్యానించారు. పార్టీ నిర్మాణం, క్యాడర్‌, వీర మహిళల భవిష్యత్తుపై దృష్టి సారించకపోవడంతో పవన్‌ నైజం తెలుస్తోందని, ఆయనది నటన అని తాము గుర్తించలేకపోయామని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కంటే ముందు పార్టీని నమ్ముకున్న వారి భవిష్యత్తు ఏంటో పవన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్టీ కోసం ఇష్టపడి, కష్టపడి పని చేశామని తెలిపారు. పవన్‌ స్వార్థం కోసం తమ కుటుంబాలు బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌ వద్దకు కొంతమంది పార్టీ పెద్దలు తమను రానివ్వలేదని అపోహ పడ్డామని, ఆయన చెప్పినట్లే వారు పని చేశారని అర్థం చేసుకోలేకపోయామని వివరించారు జనసేన పార్టీకి కాలం త్వరలోనే చెల్లిపోతుందన్నారు. పవన్‌ గురించి త్వరలోనే స్పష్టత వస్తుందని, ఆయన తీసుకునే నిర్ణయాలపై అనుమానాలున్నాయని పేర్కొన్నారు. పార్టీలో పని చేసిన వారికి ఎందుకు సీట్లు ఇవ్వలేదని, టిడిపి వారికే సీట్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నీ బయట పెడతానన్నారు. కాపు కాసిన కాపు సామాజిక తరగతిని పవన్‌ బలి చేస్తున్నారని విమర్శించారు. పవన్‌ తల్లిని దూషించిన వ్యక్తి సుజనా చౌదరికి టికెట్‌ ఇప్పించారని, కన్నతల్లిని విమర్శించిన వారు పచ్చనోట్ల కట్టలు పడేస్తే అన్ని మర్చిపోతారా? అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గాన్ని బలోపేతం చెయ్యలేని మనోహర్‌… రాష్ట్రంలో పార్టీని ఏం బలోపేతం చేస్తారని ప్రశ్నించారు. నిబద్ధతకు పార్టీలో విలువ లేదని, నిజాయితీతో ఉంటే నమ్మరని, విధేయతకు ఉరి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ భవిష్యత్తును రెండు రోజుల్లో ప్రకటిస్తానని పోతిన తెలిపారు.

 

➡️