రజక వృత్తిదారుల అభ్యున్నతిని విస్మరించిన ప్రభుత్వాలు

Jan 30,2024 08:08 #meetings, #Rajaka Vruti Sangham
  • సేవా వృత్తిగా భావించి పథకాలన్నీ వర్తింపజేయాలి
  • రజక వృత్తిదార్ల సంఘం రాష్ట్ర సదస్సు డిమాండ్‌

ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా) : రజకవృత్తిని సేవా వృత్తిగా భావించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వృత్తిదారులందరికీ వర్తింపజేయాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.భాస్కరయ్య డిమాండ్‌ చేశారు. రజక వృత్తిదారుల రాష్ట్ర సదస్సును సంఘం రాష్ట్ర అధ్యక్షులు గురుశేఖర్‌ అధ్యక్షతన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మేకా అమరారెడ్డి భవన్‌లో సోమవారం జరిగింది. భాస్కరయ్య మాట్లాడుతూ.. ఇప్పటివరకు పరిపాలించిన ప్రభుత్వాలు రజకుల అభ్యున్నతికి, సంక్షేమానికి పథకాలేమీ అమలు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలకుల విధానాల వల్ల రజక వృత్తిదారులు సామాజికంగా అభివృద్ధి చెందడం లేదని విమర్శించారు. రజక వృత్తిదారులకు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం తరహా సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేసి సమర్ధవంతంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 50 ఏళ్లు నిండిన వృత్తిదార్లకు వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని, ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని, నిధులను రజక అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్‌ ద్వారా ఖర్చు చేయాలని కోరారు. జిఒ ఎంఎస్‌ ఆరు ప్రకారం ప్రతి జిల్లాల్లో రజక వెల్ఫేర్‌ కమిటీ ఏర్పాటు చేసి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించాలని, స్ట్రీట్‌ వెండర్స్‌కు లేబర్‌ సర్టిఫికెట్‌ నిబంధనను రద్దు చేసి వృత్తిదారులకు ఏడాదికి రూ.10 వేలు ఆర్థిక సాయం చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న దోబి పోస్టులను అర్హులైన వారితో భర్తీ చేయాలని, గ్రామాల్లో చెరువులపై పూర్తి హక్కులు రజక వృత్తిదార్లకే ఇవ్వాలని, శాశ్వత గృహ నిర్మాణ పథకం కింద గృహాలు కేటాయించాలని కోరారు. సదస్సులో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వి.వెంకటేశ్వరరావు, నాయకులు బి.సుబ్బారావు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వృత్తిదారులు పాల్గొన్నారు.

➡️