భారీగా నగదు, బంగారం సీజ్‌

Apr 14,2024 21:47 #cash and gold, #seized

ప్రజాశక్తి-యంత్రాంగం :సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టి నగదు, బంగారం, మద్యం, ఇతర విలువలైన వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. సరైన పత్రాలు చూపకపోవడంతో సీజ్‌ చేస్తున్నారు. ఆదివారం విజయనగరంలోని కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద వన్‌టౌన్‌ సిఐ బి.వెంకటరావు ఆధ్వర్యాన పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని ఆపి, తనిఖీ చేశారు. ఆయన వద్ద 2.663 కిలోల బంగారు నగలు, రూ.17.95 లక్షల నగదును గుర్తించారు. ఎటువంటి ఆధారాలూ చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. సీజ్‌ చేసిన బంగారు వస్తువుల విలువ సుమారు రూ.1.51 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.
125 మద్యం సీసాలు స్వాధీనం
ఎన్‌టిఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు తనిఖీలు చేపట్టి 125 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి రెండు ద్విచక్ర వాహనాల్లో మద్యం సీసాలు తరలిస్తున్న జగ్గయ్యపేటకు చెందిన సయ్యద్‌ కరిముల్లా, వేముల మహేష్‌ అనే వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుండి మద్యం సీసాలు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

➡️