అల్లర్లు జరగకుండా భారీ బందోబస్తు

May 13,2024 07:18 #Heavy security, #prevent riots
  • నలుగురు సీనియర్‌ అధికారులతో ప్రత్యేక నిఘా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తూ ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఏకపక్షంగా పనిచేస్తున్న పలువురు ఐపిఎస్‌లను బదిలీ చేసిన ఎన్నికల కమిషన్‌ రాష్ట్రంలో సమస్యాత్మక నియోజకవర్గాల్లో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు మొత్తం 1.06 లక్షల మంది పోలీసులను వినియోగిస్తోంది. అలాగే రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నలుగురు సీనియర్‌ పోలీస్‌ అధికారులను పర్యవేక్షకులుగా నియమిస్తూ ఆదివారం రాష్ట్ర డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్‌ డిజిపి అతుల్‌ సింగ్‌ను తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యవేక్షకులుగా నియమించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ, ఏలూరు, కృష్ణా జిల్లాలకు సెబ్‌ కమిషనర్‌ ఎం రవిప్రకాష్‌ను, ఎన్‌టిఆర్‌ జిల్లా, విజయవాడ కమిషనరేట్‌, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు అక్టోపస్‌ ఐజి సిహెచ్‌ శ్రీకాంత్‌ను నియమించారు. అలాగే న్యాయపరమైన అంశాలకు డిఐజి గోపినాథ్‌ జెట్టీని నియమించారు.

➡️