AP High Court : వైసిపిపై దాడుల కేసుల వివరాలివ్వండి.. రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం

Jun 13,2024 22:53 #ap government, #AP High Court, #Case, #YCP

ప్రజాశక్తి-అమరావతి : ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత వైసిపిలోని కొందరిపై జరిగిన దాడులకు సంబంధించిన వివరాలను నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డిజిపిలకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ, జస్టిస్‌ మండవ కిరణ్మయి, జస్టిస్‌ న్యాపతి విజరుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసిపి కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ వైసిపి రాజ్యసభ్య సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది రాజు రామచంద్రన్‌ వాదిస్తూ, దాడులకు సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయన్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఫిర్యాదు చేయగానే కేసు నమోదుకు పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరారు. బాధితులను ఇళ్లు, ఊళ్లు ఖాళీ చేసి వెళ్లాలని బెదిరిస్తున్నారని చెప్పారు. పిల్‌ విచారణార్హతపై తమ వాదనలు వినిపిస్తామని హోంశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి చెప్పారు. దీంతో విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది.

➡️