అన్ని వీడియోలు బయటపెట్టాలి – సజ్జల డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కేవలం చిన్న వీడియో క్లిప్పింగ్‌ను ఇసి అడ్డం పెట్టుకుని తమ పార్టీ ఎమ్మెల్యేను వెంటాడం తగదని, ఇసికి చిత్తశుద్ధి వుంటే హింస జరిగిన ప్రాంతాల్లోని అన్ని వీడియోలు బయటపెట్టాలని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ల ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పలు ప్రశ్నలను సంధించారు. 13న జరిగిన ఘటనకు చెందిన వీడియో 21న ఎలా బయటకు వచ్చిందన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవిఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్‌ వీడియో నిజమైనదేనా? అని ప్రశ్నించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మాచర్లలో ఏడు చోట్ల హింస జరిగిందని చెబుతున్న ఎన్నికల సంఘం కేవలం పాల్వాయిగేట్‌ వీడియోనే ఎందుకు లీక్‌ చేసిందన్నారు. అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఓటర్లపై టిడిపి గూండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నా.. ఇసి వారిమీద ఎందుకు చర్య తీసుకోలేదన్నారు. పోలింగ్‌ అనంతరం జరిగిన సంఘటనలు పరిశీలిస్తే పోలీసులు, టిడిపి కుమ్మక్కైనట్లు కనిపిస్తోందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఈ మేరకు ఆయన నారా లోకేష్‌ ట్వీట్‌లో విడుదల చేసిన వీడియోతో తమకు సంబంధం లేదని ఇసి ప్రకటన చేశాక ఆయన ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. మాచర్లలో టిడిపి నాయకులు అల్లర్లు సృష్టించే అవకాశం వుందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఇసికి ఫిర్యాదు చేసినా స్పందించకుండా, రిగ్గింగ్‌ను నివారించేందుకు వెళ్లిన ఆయనపైనే కేసు పెట్టడం తగదని మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మీడియాతో అన్నారు.

➡️