అధికారంలోకి వస్తేధరలు తగ్గిస్తా ! : చంద్రబాబు

Jan 6,2024 08:59 #meeting, #Nara Chandrababu, #speech
  • 25 లక్షల ఉద్యోగాలిస్తాతెలుగుజాతిని నంబర్‌ 1 చేస్తా – కనిగిరి సభలో టిడిపి అధినేత చంద్రబాబు

ప్రజాశక్తి- కనిగిరి, ఒంగోలు బ్యూరో : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినవెంటనే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని వెలుగొండ సాధన ప్రాంగణంలో శుక్రవారం ‘రా…కదిలిరా..’ పేరుతో సభను నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ సంకల్ప బలం, అనుభవంతో తెలుగు జాతిని ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలబెడతానన్నారు. దీనికి ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం, సహకారం కావాలని కోరారు. జగన్‌ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలను నీరుగారుస్తోందన్నారు. అధికారంలో వచ్చిన వెంటనే 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాతీయ స్థాయిలో జరిగిన ఒక సర్వే ప్రకారం ఒకప్పుడు ఎక్కువ ఉద్యోగాలు పొందే రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నేడు నిరుద్యోగాంధ్రప్రదేశ్‌ గా మారిందని విమర్శించారు. జాబు రావాలంటే బాబు కావాలనే పరిస్థితికి ప్రజలు వచ్చారన్నారు. తాను కియా కార్ల కంపెనీ తీసుకొస్తే… జగన్‌ మాఫియా తీసుకొచ్చారని, తాను నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే జగన్‌ గంజాయి ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయిందని, ఇసుక మద్యం దోపిడీతో ప్రజల రక్తాన్ని తాగుతూ ప్రజాధనం తాడేపల్లి లోని జగన్‌ ఇంటికి చేరుతోందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.కనిగిరి ప్రాంత ప్రజల నీటి కష్టాలు తెలుసని, తాను శ్రీకారం చుట్టిన వెలుగొండ ప్రాజెక్టుని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేసి పశ్చిమ ప్రకాశం అందులోని కనిగిరిని సస్యశ్యామలం చేస్తామన్నారు. రాష్ట్రానికి పట్టిన అరిష్టాన్ని తొలగేలా సైకిల్‌ పాలన వచ్చేలా ప్రజలు ఆదరించాలని కోరారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రజలందరూ నరకం అనుభవిస్తున్నారని, ఈ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆశించారు. జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా పౌరుషాల గడ్డ అని బ్రిటీష్‌ వారి తుపాకీ గుండుకు రొమ్ము విరిచి చూపిన ప్రకాశం పంతులు పుట్టిన గడ్డ అని.. అందుకే ఈ గడ్డ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్లు తెలిపారు. నాడు ఎన్‌టిఆర్‌ ‘రా.. కదిలిరా..’ అని పిలుపునిస్తే ప్రభంజనమైందని, నేడు రాష్ట్రాన్ని కాపాడేందుకు ‘రా.. కదలిరా..’ అని తాను, పవన్‌ కల్యాణ్‌ సమిష్టిగా పిలుపునిస్తే ప్రజలు హర్షిస్తూ అండగా నిలిచేందుకు కదిలి వస్తున్నారని అన్నారు. ఉద్యోగుల్లాగా ప్రజాప్రతినిధులను ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఏమిటని, ఈ వైసిపి ప్రభుత్వంలోనే చూస్తున్నామని విమర్శించారు. ఎమ్మెల్యేలను ఎంపిలను ఒక చోట నుంచి మరోచోటికి ట్రాన్స్‌ఫÛర్‌ చేస్తున్నారని, ఒక ఇంటిలో పనికిరాని చెత్తను మరో ఇంటిలో వేస్తే ప్రజలు ఆదరిస్తారా అని పేర్కొన్నారు. వంద రోజులు యువత కష్టపడి సైకిల్‌ పాలన తీసుకువచ్చేందుకు కృషి చేస్తే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తానని హామీ ఇచ్చారు.

➡️