జగన్‌ మళ్లీ గెలిస్తే రాష్ట్రానికి అధోగతే

టిడిపి పొలిట్‌బ్యూరోసభ్యులు యనమల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అధోగతేనని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. 2024ా25 ఆర్ధిక సంవత్సరం రెండో రోజే ఆర్‌బిఐ నుంచి ప్రభుత్వం సెక్యూరిటీల వేలంలో రూ.4 వేల కోట్లు అప్పులు తెచ్చిందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023ా24లో ఆర్‌బిఐ నుంచే రూ.70వేల కోట్ల అప్పులు చేసి ఐదేళ్లలో రూ.13 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని జగన్‌ ముంచారని పేర్కొన్నారు. కాగ్‌ లెక్కల ప్రకారమే రోజుకు రూ.257 కోట్లు చొప్పున గతేడాది రూ.93,805 కోట్లు అప్పు చేసిందని తెలిపారు. బడ్జెట్‌లో శాసనసభకు చెప్పి చేస్తామన్న అప్పులు, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులు కంటే ఇది రెండింతలు ఎక్కువ అని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక పేదరిక నిర్మూలనలో మనకంటే ఎంతో మెరుగైన స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అభివృద్ధితో కూడిన సంక్షేమం అందించే కూటమిని గెలిపించాలని కోరారు. ఐదేళ్ల నుంచి బ్రాహ్మణులను అణగదొక్కుతున్న జగన్‌కు ఎన్నికల ముందే గుర్తుచ్చొరా అని టిడిపి బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్‌ బుచ్చి రాంప్రసాద్‌ ప్రశ్నించారు. టిడిపి కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్‌ ద్వారా ఒక్కరికైనా రుణమిచ్చారా? గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. అవ్వాతాతలకు పింఛన్‌ డబ్బులు ఆలస్యం చేసిన జగన్‌ తన బినామీలకు మాత్రం వారం ముందే డబ్బులు దోచిపెట్టారని టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఆరోపించారు. పంపిణీ ఆలస్యం చేసి వృద్ధుల మరణానికి కారణమైన వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️