వలంటీర్లకు రూ.10 వేలు వేతనం

Apr 10,2024 07:40 #Nara Chandrababu, #speech
  • త్వరలో మేనిఫెస్టో విడుదల
  •  ఉగాది వేడుకల్లో టిడిపి అధినేత చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తాము అధికారంలోకి రాగానే వలంటీర్ల పారితోషికం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వలంటీర్లలో సమర్ధత, శక్తి ఉన్నాయని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా వారి భవిష్యత్తును నిర్మిస్తామని తెలిపారు. టిడిపి కార్యాలయంలో మంగళవారం జరిగిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. వలంటీర్ల జీవితాలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆడుకుంటున్నారని విమర్శించారు. ఈ వ్యవస్థను ఉపయోగించి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేసి జైలుకుపోయి జీవితాలు పాడు చేసుకుంటారో? రాష్ట్రాభివృద్ధిలో భాగమవుతారో? వలంటీర్లు తేల్చుకోవాలన్నారు. జగన్‌ను నమ్మి మోసపోవద్దని, అతను మరలా అధికారంలోకి రారని అన్నారు. జగన్‌కు సంపద సృష్టించడం చేతకాదన్నారు. సంపద సృష్టించి ప్రజల ఆదాయం తాను పెంచుతానని, అప్పుల భారం లేకుండా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తానని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే పింఛను రూ.4 వేలకు పెంచుతామని, పెంచిన వాటిని ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని అన్నారు. వికలాంగులకు పింఛను రూ.6 వేలకు పెంచుతామని గుర్తుచేశారు. ఇవన్నీ చేయాలంటే కేంద్ర సహకారం అవసరమన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా త్వరలో కూటమి మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో ప్రజలకు కారం, చేదు మాత్రమే మిగిలాయని విమర్శించారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు ఇంకిపోయాయని, జలాశయాల్లో నీళ్లు లేవని అన్నారు. కర్నూలు జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ప్రజలకు తాగునీరు ఇవ్వలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతారా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, టిడి జనార్ధన్‌, మాజీ మంత్రులు నన్నపనేని రాజకుమారి, నెట్టెం రఘు, మాజీ ఎంపి కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ అశోక్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️