ఆత్మవిశ్వాసంతో అడుగేస్తే ప్రపంచాన్ని మార్చొచ్చు : ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌

  • యువతరంతో ఉజ్వల భవిష్యత్తు

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : యువతరం ఆత్మవిశ్వాసంతో అడుగేస్తే ప్రపంచాన్ని మార్చే శక్తిని అందిపుచ్చుకుంటారని ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ అన్నారు. మంగళవారం విశాఖలోని ఎయు ఇంజనీ రింగ్‌ కళాశాల మైదానంలో అశేష సంఖ్యలో హాజ రైన యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ముందుగా ‘హలో వైజాగ్‌’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జీవితంలో ఉన్నతమైన కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడా లని అన్నారు. తాను ఆరేళ్ల వయసులో బొమ్మలు కొనుక్కోడానికి సొంతంగా పని చేసి డబ్బులు సంపాదించిన సందర్భాన్ని వివరించారు. ప్రతి వ్యక్తీ ముందుగా తనకు లభించిన ఈ జీవితానికి కృతజ్ఞత చెప్పాలన్నారు. దాని విలువను, ప్రాధాన్యతను, సార్థకతను తెలుసుకోవాలని సూచించారు. కృతజ్ఞ త, నమ్మకం, ఐక్యత బలాన్ని తన ప్రసంగంలో నిక్‌ వివరించారు. మనకు ఉండే నమ్మకాలు, కుటుంబం, స్నేహితులు, ఆర్థిక బలం, మానసిక స్థైర్యం, కాస్త తమాషా వ్యక్తిత్వం ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తా యని తెలిపారు. మానవత్వపు ఆలోచనలను పెంపొందించుకోవాలని సూచించారు. ఎంత సంపద పెంచామనే దానికంటే ఎంత ప్రేమను పంచుతున్నామనేదే ప్రధానమన్నారు. ఎపిలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం, ఆమ్మఒడి పథకం అమలు వంటి వాటిని నిక్‌ ప్రశంసించారు. తాను ఎనిమిదోసారి భారత్‌కు వచ్చానని, ఇప్పటి వరకూ 81 దేశాలను సందర్శించానని, ఒక్క భారత దేశంలోనే తన జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చారని తెలిపారు. అందుకు భారత్‌కు కృతజ్ఞతలు తెలుపు తున్నానన్నారు. ఎయు విసి ఆచార్య పివిజిడి. ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ ఎం.జేమ్స్‌ స్టీఫెన్‌, పెద్దసంఖ్యలో ఎయు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన యువత పాల్గొన్నారు. ముందుగా వేదికపై ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, ఎయు రంగస్థల విభాగం విద్యార్థుల మైమ్‌ ప్రదర్శన, సాంస్కృతిక కార్య క్రమాలు ఆకట్టుకున్నాయి.

➡️