రాష్ట్రంలో అక్రమ నగదు పట్టివేత

  • మద్యం స్వాధీనం.. ఐదుగురు అరెస్టు
  • పోలీసుల అదుపులో బంగారు ఆభరణాలు తరలించే వాహనం

ప్రజాశక్తి- యంత్రాంగం : ఎన్నికల కోడ్‌ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ వాహనాలను అధికారులు తనిఖీలు చేశారు. అక్రమ నగదు, మద్యం, బంగారం స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని అలికాం-బత్తిలి ప్రధాన రహదారి అమృత లింగానగరం వద్ద ఓ కారులో రూ. రెండు లక్షల నగదు గుర్తించామని నగదును స్వాధీనం చేసుకుని కారును సీజ్‌ చేశామని ఎస్‌ఐ బి నిహార్‌ తెలిపారు.
అన్నమయ్య జిల్లా బి కొత్తకోట అంగళ్లులో ఓ కారులో రూ.1.20 లక్షల నగదు పట్టుకున్నారు.
తనీఖీలలో బంగారం అభరణాలు, వజ్రాలు.. పత్రాలు పరిశీలిస్తున్న అధికారులు
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద బంగారు నగలను తీసుకెళ్తున్న ఓ వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు. ఇందులో ఓ ప్రముఖ బంగారు షాపునకు చెందిన రూ.15 కోట్ల విలువజేసే బంగారు ఆభరణాలు, వజ్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో పత్రాలను పరిశీలించిన అనంతరమే వాహనాన్ని విడిచి పెడతామని అధికారులు తెలిపారు. బంగారు నగలు ఉన్న వాహనానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించారు.


మద్యం స్వాధీనం
అనంతపురం జిల్లా రాప్తాడులో కర్ణాటక మద్యాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు గ్రామానికి చెందిన రాకేష్‌, గుడుసాల మనోహర్‌, జి మహేష్‌లు కర్ణాటకలోని ఎగువపల్లి నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి 13 బాక్సులు (1248) టెట్రా ప్యాకెట్లను బొలెరోలో రాప్తాడు మండలం పాలచెర్లకు అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం జిల్లా కేంద్రం శిల్ప లేపాక్షినగర్‌లో ఆర్మీ క్యాంటీన్‌ నుంచి మద్యాన్ని తీసుకుని వచ్చి అక్రమంగా విక్రయిస్తున్న మాజీ బిఎస్‌ఎఫ్‌ జవాన్‌ హనుమంతరెడ్డిని అరెస్టు చేశారు. ఆయన వద్ద నుంచి రూ.5.50 లక్షల విలువజేసే 303 (750ఎంఎల్‌) మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలోని హమాలీకాలనీలో మాజీ సైనికోద్యోగి భరత్‌ రెడ్డి నుంచి 39 బాటిళ్ల ఫారిన్‌, ఆర్మీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం వజ్జవారి కండ్రిగ గ్రామానికి సమీపంలో అక్రమంగా కారులో తరలిస్తున్న రూ. లక్ష విలువ చేసే 60 కర్ణాటక మద్యం బాటిల్స్‌ పట్టుకున్నారు.

➡️