జిందాల్‌ పరిశ్రమ అక్రమ లాకౌట్‌ – ఒడిశాకు కార్మికుల బదిలీ

-నిరసనగా ఉద్యోగుల ధర్నా
ప్రజాశక్తి- కొత్తవలస (విజయనగరం):విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెం పంచాయతీ పరిధిలోని జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పరిశ్రమకు శుక్రవారం ఉదయం నుంచి యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరుకుకు డిమాండ్‌ ఎక్కువగా ఉండడం, ఇతర కారణాల వల్ల పరిశ్రమను మూసివేస్తున్నట్లు జిందాల్‌ పరిశ్రమ జిఎం దినేష్‌ శర్మ, హెచ్‌ఆర్‌ జిఎం గోపాల్‌కృష్ణ తెలిపారు. కార్మికులందరినీ ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్‌లోని జిందాల్‌ పరిశ్రమకు బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పరిశ్రమ గేటు వద్ద నోటీసు బోర్డు పెట్టారు. మళ్లీ పరిశ్రమను తెరిచినప్పుడు కార్మికులందరినీ ఇక్కడే పనిలో పెట్టుకుంటామని, పరిశ్రమను శాశ్వతంగా మూసివేయడం లేదని, ముడిసరుకు ధరలు తగ్గేంత వరకు మాత్రమే మూసివేస్తున్నామని యాజమాన్యం పేర్కొంది. ఈ కంపెనీలో రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికులు 450 మంది పనిచేస్తున్నారు. లాకౌట్‌ నేపథ్యంలో జిందాల్‌ పరిశ్రమ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక్కడే ఉపాధి కల్పించాలి
యాజమాన్యం నిర్ణయాన్ని నిరసిస్తూ కార్మికులు పరిశ్రమ గేటు ఎదుట ధర్నా చేశారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, వైఎస్‌ఆర్‌టియుసి నాయకులు నెక్కల నాయుడుబాబు మాట్లాడుతూ లాకౌట్‌ను ఎత్తివేసి కార్మికులకు, ఉద్యోగులకు ఇక్కడే పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. ముందస్తు ప్రకటన చేయకుండా లాకౌట్‌ విధించడం అన్యాయమన్నారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. కార్మికుల జీతభత్యాలు ఈ నెలాఖరు వరకు చెల్లించాలని కోరారు. కార్మికులను, ఉద్యోగులను జాజ్‌పూర్‌ పంపిస్తే రవాణా సదుపాయంతో పాటు హాస్టల్‌, భోజన సదుపాయం, అదనపు వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యంతో మాట్లాడి లే ఆఫ్‌ వేతనంపై నిర్ణయం వెల్లడిస్తామని పరిశ్రమ జిఎం తెలిపారు. కార్యక్రమంలో లక్కవరపుకోట ఎంపిపి గేదెల శ్రీనివాస్‌, సిఐటియు నాయకులు గాడి అప్పారావు, ఉత్తరాపల్లి, అప్పలపాలెం, నిమ్మలపాలెం సర్పంచులు సింగంపల్లి గణేష్‌, కోన దేముడు, కోట్యాడ శ్రీను, కార్మికులు పాల్గొన్నారు.

➡️