గోదావరి నదిలో అక్రమ తవ్వకాలు

ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా): తీపర్రు కానూరు-పెండ్యాల కడింపాడు( గోపాలపురం -2) గ్రామాల ఇసుక ర్యాంపుల గత కొంతకాలంగా నిబంధనలు తుంగలో తొక్కి భారీగా ఇసుక తవ్వకాలు జరుగుచున్నవి. భారీ యంత్రాలతో రాత్రి పగలు తేడా లేకుండా గుత్తేదారులు తవ్వకాలు చేస్తున్నారు. మైనింగ్ నిబంధనలు ప్రకారం తవ్వకాలు చేపట్టకుండా నిబంధనలు తుంగలో తొక్కి లోతుగా తవ్వకాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా అధికారులు తవ్వకాల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. కానూరు- పెండ్యాల తీపర్రు ఇసుక ర్యాంపులలో
గ్రామాల కార్మికుల సహాయంతో ఇసుక ఎగుమతులు చేయవలసి ఉండగా, ఇసుక ర్యాంపుల నిర్వహణ కార్మికులను పక్కన పెట్టి యేదేచ్చగా భారీ యంత్రాలతో అక్రమ మైనింగ్ ఇసుక తవ్వకాలు చేస్తున్నారని పలువురు అంటున్నారు. తీపర్రు ఇసుక ర్యాంపులో గోదావరి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి గోదావరి నీటిని పక్క పాయకు మళ్లించి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. దీని ప్రభావం వలన దిగువ ప్రాంత లంక పరివాహక రైతులకు త్రాగు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ తవ్వకాలు చేయటం వల్ల సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి సారవంతమైన లంక భూములు గోదావరి కోతకు గురై నదీ గర్భంలో కలసిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా నది గర్భాన్ని కొండదొలిసినట్టు భారీ యంత్రాలతో గోతులుగా అక్రమ మైనింగ్ తవ్వకాలు చేస్తున్న పట్టించుకునే నాధుడు లేడని పలువురు అంటున్నారు. ఇప్పటికే తీపర్రు గ్రామ పరిసర ప్రాంతాల్లో గతంలో ఇసుక అక్రమ మైనింగ్ భారీ తవ్వకాలు కారణంగా సారవంతమైన గోదావరి పరివాహక లంక భూమి గోదావరి కోతకు గురై నదీ గర్భంలో కలిసిపోయింది.

➡️