ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడికి అస్వస్థత

May 15,2024 21:41 #chitoor, #coma, #Election Duty, #teacher
  •  చికిత్స పొందుతూ కోమాలోకి
  •  ఇసి తీరుపై యుటిఎఫ్‌ ఆగ్రహం

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : సార్వత్రిక ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయుడు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. సకాలంలో వైద్యం అందక కోమాలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం చిన్నయ్యగుంట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తున్న సుమన్‌రావును ఎన్నికల నిమిత్తం గూడూరు నియోజకవర్గంలోని చెందోడు గ్రామం పోలింగ్‌ స్టేషన్‌ నెంబర్‌ 176కు ఈ నెల 12న పంపారు. ఆ రోజు రాత్రి ఆరోగ్యపరంగా సుమన్‌రావు ఇబ్బంది పడుతుండడంతో ఆ విషయాన్ని పిఒకి తెలిపారు. ఆయన పట్టించుకోకపోవడంతో ఈ నెల 13న ఉదయం 5 గంటలకే పోలింగ్‌ విధులకు హాజరయ్యారు. విధుల్లోకి వెళ్లాక తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. దీంతో అక్కడే ఉన్న ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, గ్యాస్ట్రిక్‌ టాబ్లెట్‌ ఇచ్చి ప్రధమ చికిత్స చేశారు. సుమన్‌ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో కోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లారు. దీంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం నిమిత్తం నెల్లూరు అపోలో హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు ఐసియులో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుడిని అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సుమన్‌రావు ఆరోగ్య పరిస్థితిపై ఎన్నికల అధికారులు కనీస ప్రకటన చేయకపోవడంపై యుటిఎఫ్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సుమన్‌రావు కోలుకునేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను ఎన్నికల కమిషన్‌ అందజేయాలని డిమాండ్‌ చేశారు.

➡️