మందుల రంగంలో అక్రమాలను అరికట్టాలి – ఎఫ్‌ఎంఆర్‌ఎఐ సమావేశాల్లో పలు తీర్మానాలు ఆమోదం

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ రిప్రజంటేటివ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ కౌన్సిల్‌ సమావేశాల్లో భాగంగా రెండో రోజు గురువారం పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. విజయవాడ ఎంబివికెలో జరిగిన కార్యక్రమంలో సంస్థ జాతీయ కార్యవర్గ సభ్యులు శాంతునన్‌ మిత్ర తీర్మానాలను ప్రవేశపెట్టారు. మందుల రంగంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని, మందులపై జిరో శాతం జిఎస్‌టి ఉండాలని, మందుల ధరలు నిర్ణయించడం లోపభూయిష్టంగా ఉందని, ప్రభుత్వ రంగ మందుల కంపెనీలను పునరుద్దరించాలని పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ మాట్లాడుతూ.. బిజెపి నయా ఉదారవాద ఆర్థిక విధానాల వల్ల దేశంలో ఎప్పుడూ లేనంతగా ఆర్థిక, రాజకీయ, సామాజిక అంతరాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేస్తూ, ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ప్రజారోగ్యాన్ని అప్పగించే ప్రయత్నం చేస్తోందన్నారు. అనంతరం కేరళకు మద్దతుగా ఎంబి భవన్‌ వద్ద నిరసన తెలిపారు.

➡️