కిం కర్తవ్యం?

Feb 21,2024 10:37 #pavan kalyan

రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌లో పోటీ లేనట్లేనా?

టిడిపి నేతల్లో మొదలైన అంతర్మధనం

పవన్‌ సమీక్ష అనంతరం మారిన పరిణామాలు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధికిం. కర్తవ్యం ఏంటి? ఇప్పుడేం చేయాలి? అంటూ రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ నియోజక వర్గాల టిడిపి శ్రేణుల్లో అంతర్మధనం మొదలైంది. ముఖ్యనేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకూ ఈ ప్రశ్న వెంటాడుతోంది. టిడిపి, జనసేన పొత్తు నేపథ్యంలో అసెంబ్లీ స్థానాల పోటీపై కొంత కాలంగా ఉత్కంఠ నెలకొన్న విషయం విదితమే. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో టిడిపికి క్షేత్రస్థాయి వరకూ బలమైన కేడర్‌ ఉందని చెబుతుండగా, సామాజిక తరగతుల సమీకరణలతో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తోందని ప్రకటించారు. తాజాగా జిల్లాలోని ముఖ్యనేతలతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం పవన్‌ కల్యాణ్‌ ఎటువంటి ప్రకటనా చేయలేదు. కానీ, రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి తాను బరిలో నిలబడతానని జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌ ప్రకటించారు. బిజెపి నేత సోము వీర్రాజు రాజమహేంద్రవరం సిటీ నుంచి లేదా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన విషయం విదితమే. బిజెపి ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్ర వరం నుంచి బరిలో ఉంటారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కొన్ని రోజులుగా టిడిపి అధినేత చంద్రబాబు బిజెపితో సైతం పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. సీట్ల కేటాయింపులు, సర్దుబాట్ల గురించి ప్రకటించడమే ఇక తరువాయి. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ నియోజక వర్గం కూడా పొత్తులో భాగంగా బిజెపికి కేటాయిస్తే దాదాపుగా టిడిపి పోటీలో లేనట్లేననే ఆందోళన టిడిపి నేతలను వెంటాడుతోంది. ఆ పార్టీకి కంచుకోట అయిన రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ స్థానాల్లో పోటీకి దూరమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి విజయదుందుభి మోగించింది. ఫ్యాన్‌ గాలిలోనూ రాజమహేంద్ర వరం సిటీ, రూరల్‌ స్థానాల్లో సైకిల్‌ నిలదొక్కుకుంది. విజయం సొంతం చేసుకుంది. ఈ రెండు నియోజక వర్గాల్లోనూ అభ్యర్థులిద్దరూ సుమారు 15 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఆదిరెడ్డి అప్పారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి చొరవతో టిడిపికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉండగంతో విజయం వరించింది. ప్రస్తుతం అధినేత నిర్ణయాలు ముఖ్యనేతల నుంచి క్షేత్రస్థాయి నేతల వరకూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాజాగనరంలో టిడిపిలో ఇప్పటికే ముసలం మొదలైంది. జనసేనకు సహకరించబోమని అక్కడి టిడిపి శ్రేణులు స్పష్టం చేశాయి. రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ స్థానాలపై తాత్సార్యం చేయకుండా స్పష్టత ఇవ్వాలని కేడర్‌ కోరుకుంటున్నారు. అధినేత ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.

➡️