‘కౌన్సిల్‌- కమిషన్‌’ వాడటం చట్టవిరుద్ధం – పౌరసరఫరాలశాఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :వినియోగదారుల స్వచ్చంద సంస్ధలు , సంస్థలు తమ సంస్థ పేరులో కౌన్సిల్‌, కమిషన్‌ అనే పదాలను ఉపయోగించడం చట్ట విరుద్ధమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనరు హెచ్‌ అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. కొందరు ఈ పదాలను ఉపయోగిస్తున్నట్లు రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాలశాఖ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక వేళ ఏదైనా వినియోగదారుల స్వచ్చంద సంస్థ ” కౌన్సిల్‌,” ”కమిషన్‌’ అనే పదాలు ఉపయోగిస్తే అటువంటి సంస్ధలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఏదైనా వినియోగదారుల స్వచ్చంద సంస్థ తన పేరులో కౌన్సిల్‌, కమిషన్‌అనే పదాలను కలిగిఉంటే వెంటనే ఆ పదాలను తొలగించాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనరు ఆదేశించారు.

➡️