సైకిల్‌ గుర్తుపై పోటీ చేస్తే బాగుండేది

Apr 30,2024 21:59 #coments, #Mudragada, #pavan kalyan, #YCP
  •  పవన్‌ కల్యాణ్‌పై ముద్రగడ ఘాటు వ్యాఖ్యలు

ప్రజాశక్తి – కిర్లంపూడి (కాకినాడ జిల్లా) : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గాజుగ్లాసు గుర్తుపై కాకుండా సైకిల్‌ గుర్తుపై పోటీ చేసి ఉంటే బాగుంటుందని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ముద్రగడ మాట్లాడారు. చంద్రబాబు, పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం అనే ఆకలితో చంద్రబాబు అలమటిస్తున్నారన్నారు. కాపు ఉద్యమాన్ని అణచివేసి తన కుటుంబాన్ని నానా వేధింపులకు గురిచేశారని, అలాంటి చంద్రబాబుతో పవన్‌కల్యాణ్‌ జతకడతారా? అని ప్రశ్నించారు. సాధారణ పెంకుటింట్లో ఉండే చంద్రబాబు నాయుడు అపర కుబేరుడు ఎలా అయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌టిఆర్‌పై చెప్పులతో దాడులు చేయించిన చంద్రబాబు ఇప్పుడు ఆయన విగ్రహానికి దండలు వేస్తున్నారన్నారు. రాజకీయం అంటే సినిమా డైలాగులు చెప్పడం కాదని, సినిమా డైలాగులు విని యువత బలి కావొద్దని కోరారు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటేనే విలువ ఉంటుంది. 2014 నుంచి మోడీతోనే అంటకాగుతున్నా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణను ఎందకు ఆపలేదని, కాపు రిజర్వేషన్ల కోసం ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. మార్చి 15న వైసిపిలో చేరానని, అప్పటి నుంచి పార్టీ గెలుపునకు తన వంతు కృషి చేస్తున్నానన్నారు.

➡️