అవనిగడ్డ జనసేన సీటు మండలికే

  • రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జనసేన పార్టీ మరో రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇటీవల టిడిపి నుంచి జనసేన పార్టీలో చేరిన మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌కు ఊహించినట్లుగానే అవనిగడ్డ సీటును కేటాయిస్తూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కడప జిల్లా రైల్వే కోడూరుకు అరవ శ్రీధర్‌ పేరును ఖరారు చేశారు. తొలుత ఈ స్థానానికి యనమల భాస్కరరావు పేరు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి పేరును రెండు రోజుల్లో ప్రకటిస్తారని జనసేన నాయకులు చెబుతున్నారు.
కృష్ణా జిల్లాలో ఒక్క సీటుతో జనసేన సరి..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా జనసేన తరపున ఎంపి వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నప్పటికీ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ స్థానాల్లో అవనిగడ్డ నుంచి మాత్రమే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. వాస్తవంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, పెడన, కైకలూరు, విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయాలని భావించింది. విజయవాడ పశ్చిమ మినహా అవనిగడ్డ, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో జనసేన అధినేత వారాహి యాత్ర కూడా చేపట్టారు. కూటమిలో ఉండటం, జనసేన పార్టీకి సరైన అభ్యర్థుల కొరత ఏర్పడటంతో అవనిగడ్డ నుంచి మాత్రమే అభ్యర్థిని రంగంలోకి దింపుతోంది. పొత్తులో భాగంగా జనసేన ఆశించిన పెడన సీటు కాగిత కృష్ణప్రసాద్‌ (టిడిపి), కైకలూరు సీటు మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు (బిజెపి), విజయవాడ పశ్చిమ నుంచి సుజనా చౌదరి (బిజెపి)కి కేటాయించారు.

➡️