ఎన్నికల్లో లబ్ధికోసమే జయహో బిసి

dharmana prasad comments on elections

రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ఎన్నికల్లో లబ్ధికోసమే చంద్రబాబు జయహో బిసి అంటున్నారని రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళంలోని టౌన్‌హాల్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు వచ్చినప్పుడు జయహో బిసి అంటారని, ఎన్నికలు ముగిశాక వాటి ఊసే ఉండదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇటువంటి జయహో బిసి సభలు ఇంతకుముందు చాలా సార్లు నిర్వహించారని పేర్కొన్నారు. ఎన్నికలు అయిపోగానే డిక్లరేషన్‌ కాగితాలు చింపి అవతలపారేశారని చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయని జయహో బిసి అంటే అవుతుందా? అని మండిపడ్డారు. బిసి సంక్షేమానికి ఏనాడైనా పాటుపడ్డారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు సంపన్నులను రాజసభకు పంపారే తప్ప బిసి నాయకులను ఆయన ఏనాడూ గుర్తించలేదని విమర్శించారు. చంద్రబాబు స్వతహాగా బిసి వ్యతిరేకి అని విమర్శించారు. బాబు పాలనలో బిసిల పేరుతో కొన్ని కార్యక్రమాలు అమలు చేయడం, వాటిలో కొన్నింటినీ పంచి, మిగిలనవి సొంత మనుషులకు ఇచ్చేస్తారని ఆరోపించారు. బిసిలకు సామాజిక న్యాయం విషయంలో చంద్రబాబుతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్‌ విసిరారు.

➡️