రేపు తణుకులో కల్లుగీత మహాసభ

Jan 29,2024 10:51 #Tanuku, #YCP

కార్మికులను నట్టేట ముంచిన  వైసిపి

సమస్యలు పరిష్కరించిన వారికే మద్దతు : నరసింహమూర్తి

ప్రజాశక్తి – తణుకు రూరల్‌ :   ఎపి కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర 15వ మహాసభ ఈ నెల 30, 31న తణుకులో జరగనున్నాయని సంఘం రాష్ట్ర అధ్యక్షులు జుత్తిగ నరసింహమూర్తి తెలిపారు. ఆదివారం స్థానిక లయన్స్‌ క్లబ్‌లో ఆహ్వాన సంఘం అధ్యక్షులు కామన మునిస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలిరోజు మున్సిపల్‌ కార్యాలయం నుంచి లయన్స్‌ క్లబ్‌ ఆడిటోరియం వరకు మహాప్రదర్శన చేపట్టనున్నారని తెలిపారు. బహిరంగ సభకు ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్‌, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు ఎంవి.రమణ, వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ ఎం.భాస్కరయ్య తదితర నాయకులు పాల్గొంటున్నారు.  

రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది గీత కార్మికులు స్వయం ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారన్నారు. గీత వృత్తి రక్షణ, వృత్తి ఆధునీకరణ, సంక్షేమం, ఉపాధి సామాజిక భద్రత కోసం పోరాడుతున్న కల్లుగీత కార్మికులను వైసిపి ప్రభుత్వం స్వార్థం కోసం కులాలుగా చీల్చి, పోరాడి సాధించుకున్న గీత కార్పొరేషన్‌ను మూసేసిందని విమర్శించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నమ్మి ఓట్లు వేసిన గీత కార్మికులను నట్టేట ముంచారని తెలిపారు. గీత వృత్తి విధి విధానాలపైనా భవిష్యత్తులో అనుసరించాల్సిన కార్యాచరణను ఈ మహాసభల్లో సుదీర్ఘంగా చర్చిస్తామన్నారు. గీత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన వారికే మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు గుబ్బల రాఘవులు, మామిడిశెట్టి నాగభూషణం పాల్గొన్నారు. 

➡️