ముగిసిన ‘కొలంపురి’ నాటిక పోటీలు

May 20,2024 08:05 #natikala potilu
  •  ఉత్తమ ప్రదర్శనగా ఇంద్రప్రస్థం
  •  ఉత్తమ నటీనటులుగా జ్యోతిరాజ్‌, రవీంద్రారెడ్డి
  •  గోపరాజు వెంకట శివరామ సుబ్రహ్మణ్య శర్మ జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : కళాకారులను, కళాభిమానులను ఉర్రూతలూగించిన కొలంక పురి నాటక కళాపరిషత్‌ దశమ ఆహ్వాన నాటిక పోటీలు ఆది వారంతో ముగి శాయి. గ్రామీణ వాతావరణంలో సమాజంలో నెలకొన్న పరిస్థితులకు అత్యంత దగ్గరగా నాటికల కథా కథనం సాగింది. నటీనటులు ప్రతి పాత్రకూ జీవం పోశారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో వల్లేపల్లి వెంకట్రామయ్య వేదికపై ఈ నెల 16 నుంచి కొలంకపురి నాటక కళాపరిషత్‌, వైకె నాటక కళాపరిషత్‌ సంయుక్తంగా నిర్వహించిన దశమ ఆహ్వాన నాటిక పోటీల్లో విజేతలకు ఆదివారం రాత్రి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ప్రముఖ రంగస్థల నటులు చలసాని కృష్ణప్రసాద్‌, తాళ్లూరి సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేశారు. నాటక రచయిత, నంది పురస్కార గ్రహీత పిన్నమనేని మృత్యుంజయరావు అధ్యక్షతన జరిగిన సభలో నాటక రంగ విశ్లేషకులు కందిమళ్ల సాంబశివరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపరాజు వెంకట శివరామ సుబ్రహ్మణ్య శర్మ జీవిత సాఫల్య పురస్కారాన్ని సత్తెనపల్లికి చెందిన ప్రముఖ రంగస్థల నటులు నూతలపాటి సాంబయ్యకు అందించి సత్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు గోపరాజు విజరు, సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌, ఆకురాతి భాస్కరచంద్ర, కెవి బలరామమూర్తి, నాటక విశ్లేషకులు పురుషోత్తమరావు, షేక్‌ నజీర్‌, గోపరాజు రమణ, భారతుల ఫణి, లోకం సూర్యనారాయణరావు, సుద్దపల్లి మురళీధర్‌, ఎస్‌.శరత్‌ వెంకయ్య, వి.వరప్రసాదరావు, కాంతారావు పాల్గొన్నారు.

పోటీల్లో విజేతలు ….
నాటిక పోటీల్లో విజేతల వివరాలను న్యాయనిర్ణేతలు బి.నరసయ్య, వి.లక్ష్మీకాంతారావు, వైఎస్‌కెఎన్‌ స్వామి వెల్లడించారు. నాటిక పోటీల్లో ఎంపిక చేసిన 8 నాటికలను ప్రదర్శించారు. వాటిలో ఉత్తమ ప్రదర్శనగా ‘ఇంద్రప్రస్థం’, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా ‘మూల్యం’, ఉత్తమ తృతీయ ప్రదర్శనగా ‘కొత్త పరిమళం’ నిలిచింది. ఉత్తమ నటుడిగా ఇంద్రప్రస్థం నాటికలో ఎన్‌.రవీంద్రారెడ్డి, ఉత్తమ నటిగా మూల్యం నాటికలో జయంతి పాత్రధారి జ్యోతిరాజ్‌ భీశెట్టి, ఉత్తమ రచయితగా నోట్‌ దిస్‌ పాయింట్‌ రచయిత గంధం నాగరాజు, ఉత్తమ దర్శకులుగా ఇంద్రప్రస్థం నాటికలకు దర్శకత్వం వహించిన ఎన్‌.రవీంద్రారెడ్డి దక్కించుకున్నారు.

ప్రత్యేక ప్రదర్శన ‘కౌశల్య సుప్రజా రామా’
నాటిక పోటీల ముగింపు సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనగా శ్రీసాయి ఆర్ట్స్‌ కొలకలూరు వారు ‘కౌశల్య సుప్రజా రామా’ నాటికను ప్రదర్శించారు. నాటికకు మూలకథ ఆకెళ్ళ శివప్రసాద్‌ అందించారు. నాటకీకరణ స్నిగ్ద కాగా, గోపరాజు విజరు దర్శకత్వం వహించారు.

➡️