అరెస్టులకు వామపక్ష పార్టీల ఖండన

cpm on anganwadi arrest
ప్రజాశక్తి-విజయవాడ : అంగన్‌వాడీల నిరవధిక సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తున్న కార్మికులను, కార్మిక సంఘాల నాయకులను, అంగన్‌వాడీలను కొన్ని జిల్లాల్లో అక్రమంగా అరెస్టు చేయటాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు వామపక్ష నేతలు సంయుక్తంగా పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్‌వాడీల సమ్మె విరమింప చేయాడానికి నిర్ధిష్ట ప్రతిపాదనలతో అంగన్‌వాడీ యూనియన్లతో చర్చించి పరిష్కరించాలని వారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాలు జనవరి 20న రాస్తారోకోకు పిలుపునిచ్చాయని తెలిపారు. ఈ పిలుపుకు స్పందించి అన్ని రంగాల కార్మికులు ఎక్కడికక్కడ ప్రశాంతంగా రాస్తారోకో చేస్తుండగా కొన్ని చోట్ల పోలీసులు అరెస్టులు చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. నెల్లూరులో పోలీసులతో ఘర్షణలో 5గురు మహిళలతో సహా 10 మంది గాయపడ్డారని, 5గురు ఆసుపత్రి పాలయ్యారని వెల్లడించారు. ఉరవకొండలో మహిళ సొమ్మసిల్లి పడిపోయిందని తెలిపారు. శ్రీకాకుళం, విజయవాడలో అరెస్టులు చేశారని తెలిపారు. గత 40 రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వేతనం పెంపుపై ముందుకు రావడం లేదని ఆగ్రహించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా చర్చలు నిష్ఫలమయ్యాయని తెలిపారు. ఉద్యోగుల కోర్కెలు పరిష్కరించకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించి టెర్మినేట్‌ చేస్తామని బెదిరింపులకు పాల్పడడం, నిరంకుశంగా వ్యవహరించడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల కోర్కెలు పరిష్కరించి సమ్మె విరమింపచేయాలని వారు డిమాండ్‌  చేశారు.
➡️