కర్నూలును హార్టికల్చర్‌ హాబ్‌గా మారుస్తాం : లోకేష్‌

May 3,2024 22:30 #'Yuvagalam' Sabha, #nandyala

ప్రజాశకి-నంద్యాల కలెక్టరేట్‌ : మిషన్‌ రాయలసీమ పేరుతో ఉమ్మడి కర్నూలు జిల్లాను హార్టికల్చర్‌ హాబ్‌గా, ఆటో మోటివ్‌, ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ హబ్‌గా మారుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. పరిశ్రమలు తెస్తామని, పాడి పరిశ్రమను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నంద్యాలలో శుక్రవారం యువగళం సభలో భాగంగా యువతతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తెచ్చి ప్రజల భూములను లాక్కోవాలని చూస్తున్నారని, మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనమేనని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి రాగానే వంద రోజుల్లో గంజాయిని రూపు మాపుతామని తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకు భరోసా ఇచ్చారు. సిఎఎ వల్ల మైనార్టీలు బయపడవద్దని, మైనార్టీల భద్రతకు చంద్రబాబు బాధ్యత తీసుకుంటారని హామీ ఇచ్చారు. సమావేశంలో నంద్యాల ఎంపి అభ్యర్థి బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌ఎండి ఫరూక్‌, టిడిపి జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

➡️