కొల్లేరును మూడో కాంటూరుకు కుదిస్తాం

May 1,2024 00:54 #2024 election, #chandrababau
  •  ల్యాండ్‌ టైటిట్‌ యాక్ట్‌తో హక్కులు కోల్పోతారు
  •  దెందులూరు, తెనాలి సభల్లో చంద్రబాబు

ప్రజాశక్తి – ఏలూరు, గుంటూరు ప్రతినిధులు : కొల్లేరులో అక్రమ చెరువులు తవ్వుతున్నారని, ఇక్కడి ప్రజలకు కాంటూరు సమస్య ఇబ్బందికరంగా మారిందని, 2019లో అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే కాంటూరు సమస్య తీరేదని, అధికారంలోకొచ్చాక కేంద్రంతో మాట్లాడి కొల్లేరును మూడో కాంటూరుకు కుదిస్తామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లాలో దెందులూరు, గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన సభలలో ఆయన ప్రసంగించారు. గత ఐదేళ్లలో రైతులకు అండగా నిలవలేని జగన్‌ నాయకుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. నాయకుడు అంటే సింహాన్ని, పులిని అని చెప్పుకోవడం కాదు.. సమర్థవంతమైన పాలనతో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి…గంజాయి ఇచ్చి యువత భవిష్యత్తును నాశనం చేయకూడదన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో ఆన్‌లైన్‌ ద్వారానే ప్రజల ఆస్తులు దోచుకునేందుకు సిద్ధపడ్డారని ఆరోపించారు. ‘నాలో మంచితనమే చూశారని, నా కఠినత్వం రాబోయే రోజుల్లో చూస్తారని’ ప్రత్యర్థులను హెచ్చరించారు. పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకూ నీరిస్తామని, ఒకటి, రెండు లిఫ్టులు పెట్టి కుడికాలువ నుంచి దెందులూరుకు నీరిస్తామని హామీ ఇచ్చారు. ఆక్వాను ఆదుకుంటామని, యూనిట్‌ రూ.1.50కు విద్యుత్‌ అందిస్తామని, పామాయిల్‌కు మద్దతు ధర, 90 శాతం సబ్సిడీతో పామాయిల్‌కు డ్రిప్‌ ఇరిగేషన్‌, రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, డిఎస్‌సి నిర్వహిస్తామని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామన్నారు. బిజెపితో తాను నేరుగా పొత్తుపెట్టుకున్నానని, కానీ జగన్‌ పరోక్షంగా పొత్తులో ఉన్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపి అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్‌, దెందలూరు ఎమ్మెల్యే అభ్యర్ధి చింతమనేని ప్రభాకర్‌, గుంటూరు లోక్‌సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, జనసేన తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తదితరలు పాల్గొన్నారు.

➡️