ఎల్‌జి పాలిమర్స్‌ అనుమతులు రద్దు చేయాలి

May 4,2024 21:14 #CH Narsingrao, #CITU, #LG Polymers
  •  సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ : శ్రీసిటీలో ఎల్‌జి పాలిమర్స్‌ కంపెనీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఆ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం విశాఖలోని జగదాంబ దరి సిఐటియు జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కెఎం.కుమార్‌ మంగళంతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎల్‌జి పాలిమర్స్‌ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలన్నీ ఏకగ్రీవంగా ఆ కంపెనీ యాజమాన్యాన్ని తప్పుబట్టాయన్నారు. 1986 నుంచి అనుమతులు లేకుండా దక్షిణకొరియా యాజమాన్యం ఎల్‌జి కంపెనీ నడిపిన విషయాన్ని గుర్తుచేశారు. కాలం ముగిసిన ట్యాంకులు వాడటం వల్ల స్టెరైన్‌ లీక్‌ అయ్యి విశాఖలో 12 మంది మృతిచెందినా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టలేదన్నారు. మరలా ఆ కంపెనీకి శ్రీసిటీలో అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రమాదం జరిగిన కాలంలో 12 మంది మరణించడంతో పాటు గత నాలుగేళ్ళలో మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. 2020 మేలో స్టెరైన్‌ గ్యాస్‌ పీల్చి చనిపోయిన యలమంచిలి కనకారావు, కడలి సత్యనారాయణ, పాల వెంకయ్యమ్మ కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఎల్‌జి పాలిమర్స్‌ విషవాయువుల లీకేజీ ఘటనకు నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా ఎల్‌జి పాలిమర్స్‌ లిమిటెడ్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తక్షణమే బాధితులకు వైద్య, అర్థిక సహాయం అందించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️