పథకాలకు నిధులపై సుదీర్ఘ వాదనలు

May 10,2024 08:05 #AP High Court, #judgement

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై గురువారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఉదయం పదన్నర గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు వాదనలు కొనసాగాయి. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, చేయూత, విద్యాదీవెన, వైఎస్‌ఆర్‌ ఆసరా, ఇబిసి నేస్తం తదితర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహకారం ఇంతవరకు అందని విషయం తెలిసిందే. దీంతో పోలింగ్‌ ప్రక్రియ తరువాత ఈ నిధులను విడుదల చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. 13వ తేది పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తరువాత నిధుల విడుదలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపింది. అయితే, ఇసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ పలు వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలయ్యాయి. వీటిపూ జరిగిన వాదనల సందర్భంగా వివిధ పథకాలకు రూ.14,165 కోట్ల విడుదలకు రాష్ట్రం అనుమతి కోరిందని, పోలింగ్‌ అయ్యాక లబ్ధిదారులకు జమ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు ఇసి తరపున సీనియర్‌ అడ్వకేట్‌ దేశారు అవినాష్‌ చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే జూన్‌ 6 వరకు పంపిణీ చేయరాదని గతంలో ఉత్తర్వులు ఇచ్చామని, తాజాగా వాటిని సవరించామని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. కొద్దిమంది లబ్ధిదారులు మాత్రమే కోర్టుకు వచ్చారని ఆయన చెప్పారు. పోలింగ్‌కు ఒకట్రెండు రోజుల ముందు జమ చేయాలని కోరడం సరికాదన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందే నిధులను విడుదల చేయాల్సి వుందని, ఎందుకు జాప్యమైందో తెలపాలని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదన్నారు. పిటిషన్‌ దారుల తరపున వాదించిన సీనియర్‌ అడ్వకేట్లు సివి మోహన్‌రెడ్డి, న్యాయవాది విఆర్‌రెడ్డి కొవ్వూరులు రాష్ట్రంలో 103 మండలాల్లో కరువు ఉన్నట్లుగా గుర్తింపు ఇచ్చాక గత ఖరీఫ్‌ సీజన్‌లో నష్టపోయిన 6.95 లక్షల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించరాదని ఇసి ఆదేశాలు జారీ చేయడం చెల్లదన్నారు. సకాలంలో విద్యా దీవెన కింద రూ.97.89 కోట్లను విడుదల చేయకపోతే విద్యార్థులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో పోస్టు డేట్స్‌తో చెక్కులు ఇచ్చేందుకు ఇసికి అనుమతి ఇచ్చిన విషయాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో అమలులోకి వచ్చిన ఆసరా, ఇబిసి నేస్తం, చేయూత వంటి పథకాల నిధులను కూడా విడుదల చేయకుండా ఇసి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. రాష్ట్రం తరపున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌ శ్రీరామ్‌ వాదిస్తూ.. ఇవన్నీ పాత పథకాలేనని, వీటి అమలును నిలుపుదలకు ఇసికి అధికారం లేదన్నారు. కొత్త పథకాలకు ఇసి ఆంక్షలు పెట్టవచ్చునని చెప్పారు. స్క్రీనింగ్‌ కమిటీ ప్రతిపాదనలపై ఇసి నిర్ణయం తీసుకోకుండా తీవ్ర జాప్యం చేసిందన్నారు.

➡️