అంజాద్‌కు మాధవి, అఫ్జల్‌ గట్టి పోటీ !

May 7,2024 03:25 #2024 election, #Kadapa, #TDP, #YCP
  • కడపలో ప్రధాన పార్టీల ముమ్మర ప్రచారం

ప్రజాశక్తి – కడప ప్రతినిధి : కడప అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌ సహా మరో 10 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నా వైసిపి అభ్యర్థి, డిప్యూటీ సిఎం ఎస్‌.బి.అంజాద్‌బాషా, టిడిపి అభ్యర్థి ఆర్‌.మాధవి, ఇండియా బ్లాక్‌ తరపున కాంగ్రెస్‌ అభ్యర్థి అప్జల్‌ఖాన్‌ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నియోజకవర్గంలో 2,83,543 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మైనార్టీ ఓటర్లు ఉన్న ఇక్కడ… మూడు దశాబ్దాలుగా మైనార్టీ అభ్యర్థులే ఎన్నికవుతున్నారు. అధికార, ప్రతిపక్ష, ఇతర పార్టీలు సైతం మైనార్టీ అభ్యర్థులకే టికెట్లు ఇస్తున్నాయి. 2019లో వైసిపి అభ్యర్థిగా అంజాద్‌ బాషా, టిడిపి అభ్యర్థిగా అమీర్‌బాబు పోటీచేశారు. కానీ 2014లో టిడిపి, బిజెపి పొత్తులో భాగంగా బిజెపి అభ్యర్థి కందుల రామచంద్రారెడ్డి పోటీ చేశారు. టిడిపి రెబెల్‌గా దుర్గాప్రసాద్‌ బరిలో నిలిచి ఓట్లు గణనీయంగా సాధించుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లోనూ అంజాద్‌ బాషా విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో టిడిపి-జనసేన-బిజెపి కూటమి తరపున టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి సతీమణి ఆర్‌.మాధవి బరిలో నిలిచారు.
వైసిపి, టిడిపి అభ్యర్ధులు పరస్పర మాటల దాడులతో హోరెత్తిస్తున్నారు. అంజాద్‌ బాషా పదేళ్లలో చేసిన పనులు, చేసిన తప్పిదాలపై ఛార్జిషీట్‌, మేనిఫెస్టోను విడుదల చేయడం, మైనార్టీ ఓట్లలో చీలిక కోసం ఎత్తుగడలు వేయడం మొదలుకుని చివరికి ఆర్‌ఎస్‌ఎస్‌తో చేతులు కలిపి శోభాయాత్రలో పాల్గొనడం వంటి అందివచ్చిన అవకాశాలను టిడిపి అభ్యర్థి ఉపయోగించుకోవడంతో రాజకీయం పతాకస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. బిజెపి-టిడిపి-జనసేన పొత్తుతో ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా నష్టం కలగనుందో అంజాద్‌ బాషా .. ఓటర్లలో ప్రచారం గావిస్తున్నారు. అలాగే గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండు ప్రధాన పార్టీల నేతల కొన్ని చర్యలు ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్నాయి. ఇటీవల ఓ కార్పొరేటర్‌ అనుచరునిపై దాడి సందర్భంగా వైసిపి, టిడిపి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇక్కడ అభ్యర్థుల గెలుపు మైనార్టీ ఓట్లపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. వైసిపి మైనార్టీ సెల్‌ రాష్ట్ర స్థాయి నాయకులు ఆప్జల్‌ఖాన్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ దక్కింది. ఇది వైసిపి ఓట్లలో కొంత చీలిక తెస్తుందని చెపుతున్నారు. దీనికి విరుగుడుగా మాజీ డిసిసి అధ్యక్షులు నజీర్‌ అహ్మద్‌ను చేర్చుకుని వైసిపి..తన రాజకీయ చతురతను ప్రదర్శించింది. ఇండియా బ్లాక్‌ తరపున వామపక్షాల ప్రచారం, షర్మిల ఇక్కడ నుండి లోక్‌సభకు పోటీచేస్తుండడం వంటి అంశాలు కాంగ్రెస్‌ అభ్యర్థి ఆప్జల్‌ఖాన్‌కు ఉపయోగపడనున్నాయి. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఇంటింటి ప్రచారంతో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరుకుంది.

➡️