టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి

Jan 26,2024 07:45 #ennika, #tspsc chairman

కొత్త పాలకమండలి నియామకం

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టిఎస్‌పిఎస్‌సి)కి కొత్త పాలకమండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. చైర్మన్‌గా మాజీ డిజిపి పి.మహేందర్‌రెడ్డి నియామకమయ్యారు. సభ్యులుగా రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి అనితా రాజేంద్ర, ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌లో రిటైర్డ్‌ అధికారి అమీర్‌ ఉల్లాఖాన్‌, జెఎన్‌టియు హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ నర్రి యాదయ్య, యరబాది రామ్మోహన్‌రావు, పాల్వాయి రజనీకుమారిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించి పంపిన ఈ నియామకాలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అందుకు సంబంధించిన ఉత్తర్వులను గురువారం జారీ చేశారు. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌, సభ్యులు పదవీకాలం ఆరు సంవత్సరాలు లేదా సభ్యుల వయస్సు 62 సంవత్సరాలు నిండే వరకూ కొనసాగుతారు. మహేందర్‌రెడ్డికి ప్రస్తుతం 61 సంవత్సరాలు, చైర్మన్‌గా ఆయన ఇంకా 11 నెలలు మాత్రమే సేవలందిస్తారు. ఈ ఏడాది డిసెంబర్‌ మూడున ఆయన పదవీకాలం ముగుస్తుంది.

➡️