వడదెబ్బకు నలుగురు మృతి

ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో వడదెబ్బకు శనివారం నలుగురు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకరారం… ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన కంది శ్రీనివాసరెడ్డి (45) మసాలా బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూలాగే తోపుడు బండి తీసుకొని గ్రామంలోని వివిధ కూడళ్ల వద్ద బొరుగులు, మసాలా విక్రయించారు. ఎండ తీవ్రత పెరగడంతో తీవ్ర అస్వస్థతకు గురై కింద పడిపోయారు. స్థానికులు మార్కాపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారు. శింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో సుమారు 60 సంవత్సరాలు వయసు కలిగిన ఓ వృద్ధుడు ఐస్‌ బండి వేసుకొని జీవనం సాగిస్తున్నారు.. వడగాలులకు తట్టుకోలేక మృతి చెందారు. శింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవులవారిపాలేనికి చెందిన పోకూరి లక్ష్మమ్మ (80) భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బస్సు షెల్టర్‌లోనే ఉంటున్నారు. వడగాలులకు ఆమె మృతి చెందారు.
తిరుపతి జిల్లా కెవిబి పురం మండలం కోటమంగాపురం గ్రామానికి చెందిన మెరుల చంద్రయ్య (57) కూలి పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. పని కోసం రోజూ కెవిబి పురం వచ్చి వెళ్తున్నారు. మూడు రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో నీరసించారు. పనిచేస్తున్న ప్రాంతంలో కళ్లు తిరిగి పడిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.

➡️