నేటి నుండి 16 వరకు మావోయిస్టుల నిరసనలు

Apr 13,2024 08:19
  • అప్రమత్తమైన పోలీసులు
  • నైట్‌ సర్వీసు బస్సులు రద్దు

ప్రజాశక్తి -సీలేరు : ఛతీష్‌ఘడ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్లో సుమారు 20 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందడం, భారీ పేలుడు సామాగ్రి పోలీసులు స్వాధీనం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో పోలీసు చర్యలకు నిరసనగా ఈ నెల 12 నుండి 16 వరకు నిరసన దినాలు పాటించాలని మావోయిస్టుల పార్టీ అగ్ర నేతలు పిలుపునిచ్చారు. దీంతో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొనడంతో ముందస్తు చర్యల్లో భాగంగా మావోయిస్టు కదిలికులపై నిఘా పెడుతూ స్పెషల్‌ పార్టీ బలగాలతో కూంబింగ్‌ ముమ్మరం చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు మావోయిస్టు నుంచి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చర్యల చేపట్టారు. మావోయిస్టులు నిరసన దినాలకు పిలుపునివ్వడంతో పోలీసుల ఆదేశాలు మేరకు ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా విశాఖపట్నం నుంచి వయా సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే నైట్‌ సర్వీస్‌ బస్సులతో పాటు రాత్రివేళ తిరిగే అన్ని ఆర్టీసీ బస్సులు రద్దు చేశారు. నిరసన దినాలు నేపథ్యంలో మారుమూల గ్రామల గిరిజనుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.

ఎస్‌ఐ ఆధ్వర్యాన తనిఖీలు
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన సీలేరు తదితర ప్రదేశాల్లో శుక్రవారం ఎస్సై రామకృష్ణ ఏరియా డామినేషన్‌, కుమింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మావోయిస్టుల కదిలికలపై ప్రత్యేక దష్టి సారించామని, సిఆర్‌పిఎఫ్‌, పోలీస్‌ బలగాలతో విస్తృత తనిఖీలు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు.

➡️