5 వరకు చర్యలొద్దు ..పిన్నెల్లి పిటిషన్‌పై హైకోర్టు

May 24,2024 07:40 #AP High Court, #MLA Pinnelli

పాల్వాయిగేటు పిఒ, ఎపిఒలు సస్పెన్షన్‌ : సిఇఒ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రంలో ఇవిఎం ధ్వంసం చేసిన కేసులో వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యే పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ జూన్‌ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 6కు వాయిదా వేసింది. ఇవిఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 10 సెక్షన్‌లతో ఇసి కేసు నమోదు చేసి అరెస్టుకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పరారీలో వున్న పిన్నెల్లి గురువారం హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సంఘటన ఈ నెల 13న జరిగితే, 15న ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ముందు ఎఫ్‌ఐఆర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని, ఆ తర్వాత నారా లోకేష్‌ ట్విట్టర్‌లో వీడియోను పెట్టడంతో ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవడం సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో వీడియో మార్ఫింగ్‌ చేసి ఉండొచ్చని, ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు కావడంతో పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరిన నిరంజన్‌రెడ్డి.. సుప్రీంకోర్టు అర్నేష్‌ కుమార్‌ కేసులో మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు ఉంటే 41ఎ నోటీసులు ఇవ్వాలని ఉందని పేర్కొన్నారు. ఎలాంటి నోటీసులివ్వకుండా అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించడం తగదని వాదించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో వేసిన ఈ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ఈ నెల 5 వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, పిటిషనర్లు దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశిస్తూ కండీషన్‌ బెయిల్‌ను మంజూరు చేసింది.
చర్యలు తప్పవు
ఇవిఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తప్పవని సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు ఎస్‌పి, డిఎస్‌పితో కూడిన 8 పోలీసు బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. పాల్వాయి గేటు ఘటన విషయంలో ఇసి సీరియస్‌గా ఉందన్నారు. అలాగే పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఇవిఎం ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పిఒ, అసిస్టెంట్‌ పిఒలను సస్పెండ్‌ చేయాలని ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించేందుకు టిడిపి నేతలు ఇప్పుడు వెళ్లటం మంచిదికాదని, పరామర్శలకు ఈ సమయంలో వెళ్లద్దని చెప్పామన్నారు. ఇవిఎంలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఇసి నుంచి బయటకు వెళ్లలేదని, దర్యాప్తు సమయంలో అవి బయటకు వెళ్లి ఉంటాయని వివరించారు. ఈ నెల 25 నుంచి స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించేందుకు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

➡️