ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు

Jun 3,2024 17:41 #MLC, #suspended, #YCP

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో/శృంగవరపుకోట : విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై శాసనమండలి ఛైర్మన్‌ మోషేను రాజ్‌ సోమవారం అనర్హత వేటు వేశారు. వైసిపి నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎస్‌.కోటకు చెందిన రఘురాజు భార్య ఇటీవల నారా లోకేష్‌ సమక్షంలో టిడిపిలో చేరారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు ఎస్‌.కోట సీటు ఇవ్వొద్దని స్థానిక ప్రజాప్రతినిధులకు తెలిపారు. దీంతోపాటు వైసిపికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌.కోట వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు, విశాఖ ఎంపి అభ్యర్థి బొత్స ఝాన్సీని ఓడించాలని ప్రచారం నిర్వహించారు. దీనిపై వైసిపి విప్‌ పాలవలస విక్రాంత్‌ శాసనమండలి ఛైర్మన్‌కు వీడియో, ఫొటో ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, రఘురాజును అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. దీనిపై రఘురాజుకు ఛైర్మన్‌ మోషేన్‌రాజు నోటీసు జారీ చేశారు. మే 27న వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. తనకు ఆరోగ్యం బాగోలేదని రఘురాజు సమాధానం ఇచ్చారు. దీంతో 31న వచ్చి వివరణ ఇవ్వాలని మరో నోటీసు పంపారు. దీనికీ ఎమ్మెల్సీ స్పందించకపోవడంతో సోమవారం అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు.

➡️