నియంతృత్వ పోకడలతో మోడి పాలన నడుస్తోంది : మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ : నియంతృత్వ పోకడలతో మోడి పాలన నడుస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ ప్రతిపక్ష పార్టీల ఎంపిల సస్పెన్షన్‌ పరిణామంతో కేంద్రానికి వ్యతిరేకంగా విపక్ష కూటమి ‘ఇండియా’ దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఇందులో భాగంగా.. శుక్రవారం మధ్యాహ్నాం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ … దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా ? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. నియంతఅత్వ పోకడలతో మోడి పాలన నడుస్తోందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా స్వేచ్ఛ లేదు అని అన్నారు. బిజెపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే అంతా రోడ్డెక్కారు అని అన్నారు. ఈ నిరసనలో షబ్బీర్‌ అలీతో పాటు పలువురు సీనియర్లు పాల్గొన్నారు.

➡️