పట్టాలపై బండరాయి.. ఢీకొన్న గూడ్స్‌ రైలు

ప్రజాశక్తి – అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : కొత్తవలస – కిరండూల్‌ లైన్‌లో బొడ్డవర, శివలింగపురం మార్గమధ్యంలో పట్టాలపై పడిన బండరాయిని గూడ్స్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో రైలు పట్టాలు తప్పడం గానీ, పక్కకు ఒరగడం గానీ జరగకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. కిరండూల్‌ నుంచి ఐరన్‌ హోల్‌ లోడుతో విశాఖకు గూడ్స్‌ రైలు వస్తోంది. ఆదివారం తెల్లవారుజామున శివలింగపురం, బొడ్డవర 44వ మైలురాయి వద్ద అప్పటికే కొండమీద నుంచి బండరాయి పడింది. దీన్ని గమనించిన పైలట్‌ ఒక్కసారిగా ట్రైన్‌ బ్రేకులు వేశారు. దీంతో రైలు ముందు భాగం రాయిని ఢీకొట్టి అలానే ఆగిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు అటుగా రాకపోకలు సాగించే రైళ్లను నిలిపివేశారు. రాయిని పట్టాల మీద నుంచి తొలగించే పనులు చేపట్టారు. ఆ తరువాత రైళ్ల సేవలను పునరుద్ధరించారు. ఈ మార్గంలో నడిచే పాసింజర్‌ రైళ్ల ప్రయాణికులు తాజా ఘటనలో కొంత అసౌకర్యానికి గురయ్యారు.

➡️